తెలుగు చలన చిత్రసీమలో ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు. అందులో ఒకరు డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి. ఈమధ్యనే ఈయన తన సినీ ప్రస్ధానంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాంలో చెప్పుకొచ్చారు. ఈ షోలో తాను సినిమాల్లోకి ఎలా వచ్చారో, సీనియర్ నటుడు ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం ఎలాంటిదో మొదలైన విషయాలను గుర్తు చేసుకున్నారు. తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని కోదండరామిరెడ్డి తెలిపారు. బోర్డులు చూసుకుంటూ ‘ఓహో ఇవన్నీ సినిమా ఆఫీసులా..’ అనుకుంటూ వాటిచుట్టూ తిరిగే వాడినని, చివరకు పీసీరెడ్డిగారి సహకారంతో సినీ దర్శకుడిగా సెట్ అయ్యానని తెలిపారు కోదండరామిరెడ్డి. ఆ తర్వాత సీనియర్ ఎన్టీయార్ గారితో తనకున్న అనుబంధం గురించి వివరించారు.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఆ తరం దర్శకులంతా అన్నగారితో ఒక్క సినిమా అయినా డైరెక్ట్ చెయ్యాలని కలలు కనేవాళ్లు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఇమేజ్‌ను సరిగ్గా అంచనా వేస్తూ రాఘవేంద్రరావు, దాసరి లాంటి సీనియర్ దర్శకులే పోటీపడీ మరీ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చేవారు. అలాంటిది మన దర్శకుడు కోదండరామిరెడ్డి మాత్రం అన్నగారు పిలిచి అవకాశం ఇస్తానన్నా కూడా చేయనని ఖరాఖండిగా చెప్పేసాడు. ఆరోజుల్లో అన్నగారికి ఎదురుచెప్పేంత అంత ధైర్యం ఎవరికీ లేదు. కానీ ఏడాదికి కనీసం అరడజన్ సినిమాలు చేసేంత బిజీగా వున్న కోదండరామి రెడ్డిని అన్నగారు పిలిచి రెండుసార్లు ఈయనకు సినిమా చేయాలంటూ ఆఫర్ ఇచ్చారు. కానీ అప్పుడున్న బిజీ కారణంగా ఈయన ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు.

నిజానికి అన్నగారినికూడా డైరెక్ట్ చేసి ఉంటే.. తెలుగులో అందరు హీరోలతో సినిమాలు చేసిన ఏకైక దర్శకుడిగా కోదండరామిరెడ్డి చరిత్ర సృష్టించేవారేమో.! కానీ ఏం చేస్తాం.. ఆ రోజుల్లో ఎన్టీఆర్ సినిమా విలువ తెలియకే వచ్చిన అవకాశాన్ని వదిలేసానని చెప్పుకొచ్చారు డైరెక్టర్ కోదండరామి రెడ్డి. సీనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయకపోయినా కె.రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంటుగా పని చేస్తున్నపుడు వేటగాడు సినిమాలో మాత్రం ఓ పాట చిత్రీకరించానని ఆనందంగా చెప్పారు కోదండరామి రెడ్డి.

ఇంకా ఎన్టీఆర్ తో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇలాంటి సంఘటననే మరొకొటి పంచుకున్నారు కోదండరామిరెడ్డి. ఆరోజుల్లో ఎన్టీఆర్ వారసుడు బాలయ్యతో ‘అనసూయమ్మగారి అల్లుడు’ తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో తర్వాత చిత్రం మనం చేస్తున్నాం బ్రదర్’ అని ఎన్టీఆర్ అన్నారని, సబ్జెక్ట్ రెడీ అవడంతో వినడానికి రమ్మన్నారని, పరుచూరి బ్రదర్స్, తాను కలిసి వెళ్లామని చెప్పారు. కథ చెప్పిన తర్వాత ‘ఎలా ఉంది బ్రదర్’ అని ఎన్టీఆర్ అన్నారని, దానికి సమాధానంగా ‘నాకు నచ్చలేదండీ’ అని చెప్పానని.. ఆ వెంటనే ‘మీకు నచ్చకపోతే మేమెందుకు చేస్తాం. వదిలేయండి. తర్వాత ఎప్పుడైనా చేద్దాం’ అని ఎన్టీఆర్ చెప్పారని కోదండరామిరెడ్డి అన్నారు.

అయితే పెద్దాయనతో అలా చెప్పినందుకు బయటకు రాగానే పరుచూరి బ్రదర్స్ తనను మందలించారని అన్నారు. ఓ వారం గడిచిన తర్వాత ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి, ‘సర్ సీఎంగారు లైన్‌లో ఉన్నారు’ అని ఫోన్ ఇచ్చాడని.. ఆ ఫోన్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘బ్రదర్ ఆ కథ మాకు నచ్చింది. మీరు ఎలాగైనా చేసి పెట్టాలి’ అన్నారని, దీంతో ఆ మాట కాదనలేక ఆ సినిమా చేశామని ఆ సినిమాయే ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’ సినిమా అని తెలియజేశారు. చదివారుగా.. ఎన్టీఆర్ తో ఏ.కోదండరామిరెడ్డి గారి మధుర జ్ణాపకాలు.. వీలైతే ఈ లాక్ డౌన్ తీరిక సమయాలలో అన్నగారి పాత సినిమాలను చూసి మీరూ ఎంజాయ్ చేయండి.????????????



























