Director Pavan Sadineni : ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ఒక్కసారి తనవైపు ఇండస్ట్రీ చూసేలా చేసుకున్న డైరెక్టర్ పవన్ సాధినేని. విజయవాడ కు చెందిన పవన్ సాధినేని అమెరికా వెళ్లి తల్లిదండ్రుల కోసం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు తన ఇష్టాన్ని వదులుకోలేక షార్ట్ ఫిలిమ్స్ తీసాడు. అలా మంచి వ్యూస్ అందుకున్న పవన్ ఆ పైన సినిమాలను డైరెక్ట్ చేసి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆపైన ‘సావిత్రి’ లాంటి ఫ్లాప్ అందుకున్నా ‘సేనాపతి’ సినిమాతో మరోసారి మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ తో మంచి హిట్ అందుకుని తాజాగా జేడి చక్రవర్తి మెయిన్ లీడ్ గా ‘దయ’ అనే వెబ్ సిరీస్ తో మరోసారి మంచి హిట్ ఎందుకున్నాడు. త్వరలోనే పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్న పవన్ సాధినేని తన కెరీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఆ నిర్మాత నన్ను చూసి పారిపోయేవాడు…
పవన్ సాధినేని ఇంట్లో వాళ్ళకోసం అమెరికా వెళ్లినా సినిమా మీద ఇంట్రెస్ట్ పోలేదు. దాంతో యూనివర్సిటీలో కొంత మంది షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటే వారి వద్ద ఫ్రీగా పనిచేస్తూ తాను కొన్ని కథలను రాసుకుని షార్ట్ ఫిలిమ్స్ తీసాడు. అవన్నీ మంచి వ్యూస్తో హిట్ అవడంతో పెద్ద నిర్మాతలు తనకు ఫోన్ చేస్తారని అనుకున్నా బెక్కం వేణుగోపాల్ గారు మెసేజ్ చేశారట. చాలా బాగా తీసావు అమెరికా నుండి వచ్చినపుడు కనపడు అని చెబితే వెంటనే రెండు రోజుల్లో హైదరాబాద్ వచ్చి ఆయన ఆఫీస్ కి వెళ్ళాడట. బెక్కం వేణుగోపాల్ గారు కంగారు పడి తన కోసం అమెరికా నుండి వచ్చేయడం ఏమిటని అక్కడి నుండి వెళ్లిపోయారట.

ఇక రోజూ ఆయన ఆఫీస్ కి వెళ్లడం, ఆయన కోసం చూడటం చేసేవాడట పవన్ సాధినేని. అయితే పవన్ నుండి తప్పించుకోడానికి తప్పించుకుని తిరిగారట వేణుగోపాల్ గారు. చివరికి అక్కడున్న వారికీ, అక్కడికి వచ్చేవారికి కథ వినిపించేవాడట పవన్. చివరికి విన్నవాళ్లందరూ కథ చాలా బాగుందని చెప్పడంతో వేణు గోపాల్ గారు పిలిపించి మాట్లాడి కథ ఒకే చేసి సినిమా చేశారట. అలా ప్రేమ్ ఇష్క్ కాదల్ సినిమా మొదలయిందని ఆ సినిమా ఆయన ఒకే చేసేవరకు ఆయనని వదలలేదంటూ చెప్పారు పవన్.