టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్సన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు.. తీస్తున్న సినిమాలే ఈయనకు విమర్శలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఆర్జీవీ ‘పవర్ స్టార్’ అనే టైటిల్‌తో సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. తమ అభిమాన హీరోను టార్గెట్ చేసి సినిమాను తెరకెక్కించారంటూ పవన్ ఫ్యాన్స్ వర్మపై మండి పడుతున్నారు. పవన్ ఫ్యాన్స్ ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా వర్మ మాత్రం కూల్ గా స్పందిస్తూ.. ఈ చిత్రం విడుదల సందర్భంగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

‘ఇది ఫిక్షనల్ స్టోరీ.. పవన్ కళ్యాణ్ గురించి కాదని ఇప్పటికి వందల సార్లు చెప్పాను.. ఆ విషయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలకి ఎక్కడం లేదు.. వాళ్లకిష్టం ఉంటే చూడమనండి.. లేదంటే మానేయమనండి.. నేను మాత్రం ‘పవర్ స్టార్’ మీద సినిమాలు తీస్తూనే ఉంటాను. ఈ చిత్రం కేవలం ఎంటర్ టైన్‌మెంట్ కోసం తీసింది. అలాగే ఈ సినిమా తీసినందుకు ఎవరైనా నాకు వార్నింగ్‌లు ఇస్తే భయపడడానికి ఇక్కడెవ్వరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. నేను ఒక్కడినే ఉన్నాను. నా ఆఫీస్ అడ్రస్ అందరికీ తెలుసు. గూగుల్ మ్యాప్స్ లో కూడా వుంటుంది. దమ్ముంటే నా ఆఫీస్ కు రమ్మనండి చూద్దాం. అయినా ఇండ్రస్ట్రీ నన్ను బ్యాన్ చేయడం ఏమిటి.? కుక్కలు మొరిగితే నేను పెద్దగా పట్టించుకోను” అంటూనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని మరింత రెచ్చ గొడుతూ ‘పవన్ కళ్యాణ్‌పై ఈ ఒక్క చిత్రమే కాదు.. వరుసగా 5 సినిమాలు చేస్తున్నాను’ అంటూ సంచలన ప్రకటన చేశారు వర్మ. ‘పవర్ స్టార్’ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాలు ఉంటాయా..? లేదంటే ఆ చిత్రాలలోని పాత్రలు ఎలా ఉండబోతున్నాయి.? మొదలైన విషయాలను త్వరలోనే తెలియ జేస్తానన్నారు వర్మ.

ఒక్క చిత్రంతోనే తన ఆఫీస్‌లోని అద్దాలను పగలగొట్టించుకుని పోలీస్ కేసుల వరకూ వెళ్లిన వర్మ.. మరో 5 చిత్రాలు అంటూ సంచలన ప్రకటన చేయడంతో ఈ వివాదం ఎంతవరకూ వెళ్తుందోనని టాలీవుడ్ ప్రముఖులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలావుండగా ‘పవర్ స్టార్’ చిత్రాన్ని లేటెస్ట్ గా ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్స్’లో విడుదల చేసిన వర్మ.. టికెట్ రేటును రూ. 250గా ఆన్ లైన్‌లో వసూలు చేస్తున్నారు. అయితే నిన్నటి వరకూ రూ. 150 ఉన్న ఈ టిక్కెట్ ధర.. ఒక్కరోజులోనే రూ. 250కి పెంచేశారు. అయితే అన్ని టాక్స్‌లు కలుపుకుని ఆర్జీవీ వరల్డ్ లో ‘పవర్ స్టార్’ చిత్రాన్ని ఒక్కసారి చూడాలంటే.. రూ. 295 చెల్లించాలని చెబుతున్నారు వర్మ. మొత్తంగా టాలీవుడ్ హిస్టరీలో ‘శివ’ సినిమా ఎలాగో.. ఆన్ లైన్ థియేటర్‌కి ‘పవర్ స్టార్’ చిత్రం అలా అని.. ఇంత డబ్బు పెట్టి ఆన్ లైన్ లో సినిమా చూడటం ఒక్క ‘పవర్ స్టార్’ సినిమాకే సాధ్యమైందంటూ వర్మ సంతోషంగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాను ఇప్పటివరకూ ఎంత మంది చూశారు.. ఎంత డబ్బు వచ్చిందో చెప్తే చాలామంది పవన్ ఫ్యాన్స్ గుండె ఆగి చచ్చిపోతారని.. వాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే లెక్కలు అస్సలు చెప్పనంటూ తెలివిగా తప్పించుకున్నారు వర్మ.



























