కరోనా సృష్టిస్తున్న విలయతాండవానికి చాలా దేశాలు ఇప్పటికే ఆర్ధికంగా కుదేలయ్యాయి. కరోనాపై పోరుకోసం భారత కార్పొరేట్ దిగ్గజాలు, క్రీడాకారులు, సెలెబ్రెటీలు స్వచ్చందంగా పీఎం కెర్స్ కు మరియు ఆయా రాష్ట్రాల సీఎం సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు డీమర్ట్ వంతు వచ్చింది. ఈ క్రమంలో అవెన్యూ సూపర్ మార్ట్ రిటైల్ బ్రాండ్ డీమర్ట్ ఆర్ధిక సహాయం చేసేందుకు సిద్దమయింది. ఈమేరకు పీఎం కేర్ ఫండ్స్ కు 155 కోట్ల రూపాయిలను విరాళంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో పీఎం కెర్స్ కు 100 కోట్లు ప్రకటించగా మహారాష్ట్ర, గుజరాత్‌లకు రూ.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు రూ.5 కోట్లు, తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లకు రూ.2.5 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

కరోనాపై ఇప్పటికే భారత కుబేరులు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో టాటా గ్రూప్ మొత్తం రూ.1500 కోట్లు ప్రకటించగా.. అందులో 500 కోట్లు పీఎం కేర్ ఫండ్స్ కు ఇచ్చింది. విప్రో గ్రూప్ అజిత్ ప్రేమజీ ఫౌండేషన్ రూ.1125 కోట్లు విరాళం ఇచ్చారు. మరో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ముఖేష్ అంబానీ కూడా రూ. 500 కోట్లను విరాళంగా ప్రకటించారు. అలాగే మహారాష్ట్ర, గుజరాత్ లకు మరో రూ.5 కోట్లు విరాళం ప్రకటించారు. కోల్ ఇండియా రూ.220 కోట్లు, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ రూ.220 కోట్లు విరాళం ఇచ్చారు. మరో పక్క ఐటీసీ రూ.150 కోట్లు, కోటక్ మహీంద్రా రూ.50 కోట్లు విరాళంగా ప్రకటించాయి.




























