స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. బ్యాంకింగ్ నుంచి వ్యక్తిగత ఫోటోలు వరకు అన్నీ ఒకే ఫోన్‌లో ఉంటున్న ఈ డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు కూడా అదే వేగంతో పెరుగుతున్నాయి. మనకు తెలియకుండానే కాల్స్, మెసేజ్‌లు లేదా డేటా వేరే నంబర్లకు ఫార్వర్డ్ అవుతున్న సందర్భాలు కూడా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫోన్ హ్యాక్ అయ్యిందని ఎలా గుర్తించాలి? కొన్ని సాధారణ సంకేతాలు ఉంటాయి. ఫోన్ ఒక్కసారిగా నెమ్మదిగా మారడం, బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం, ఇంటర్నెట్ ఎక్కువగా వాడకపోయినా డేటా వేగంగా అయిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. మీరు ఇన్‌స్టాల్ చేయని యాప్‌లు ఫోన్‌లో కనిపించడం, మీకు తెలియకుండానే మెసేజ్‌లు లేదా ఈమెయిల్స్ పంపబడడం కూడా హ్యాకింగ్ సంకేతాలే కావచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ పోలీసులు ఒక సులభమైన పద్ధతిని సూచిస్తున్నారు. మీ మొబైల్ ఫోన్ సేఫ్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#21# (కొన్ని డివైజ్‌లలో *#21# మాత్రమే) డయల్ చేయాలి. స్క్రీన్‌పై కాల్ ఫార్వార్డింగ్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ వంటి విభాగాల పక్కన “Not Forwarded” అని ఉంటే మీ ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్ యాక్టివ్‌లో లేదని అర్థం. ఒకవేళ ఏదైనా అనుమానాస్పద నంబర్ కనిపిస్తే, మీ కాల్స్ లేదా డేటా వేరే చోటుకు మళ్లించబడుతున్న అవకాశాన్ని పరిశీలించాలి.
ఫార్వార్డింగ్ యాక్టివ్‌గా ఉందని అనుమానం ఉంటే, వెంటనే ##002# డయల్ చేయడం ద్వారా అన్ని రకాల కాల్ ఫార్వార్డింగ్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయవచ్చు. ఇది తాత్కాలిక రక్షణ చర్యగా పనిచేస్తుంది. అయితే, సమస్య కొనసాగితే మీ మొబైల్ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్ లేదా సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించడం ఉత్తమం.
నిపుణుల సూచనల ప్రకారం, ఫోన్ భద్రత కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అపరిచిత లింక్స్‌పై క్లిక్ చేయకూడదు. అనవసరమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేయకూడదు. అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లు ఇన్‌స్టాల్ చేయాలి. ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం కూడా ముఖ్యమే. బ్యాంకింగ్ వివరాలు లేదా ఓటీపీ వంటి సున్నితమైన సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదు.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసగాళ్ల పద్ధతులు కూడా మారుతున్నాయి. అందుకే వినియోగదారులు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉంది.
మీ ఫోన్ భద్రతపై సందేహం ఉంటే, వెంటనే చెక్ చేసి అవసరమైన చర్యలు తీసుకోవడం మంచిది. డిజిటల్ యుగంలో జాగ్రత్తే రక్షణ.



























