ఆ రోజుల్లో కుర్రాళ్ల మనసులో ఆమె ఒక కళల రాణి దివినుండి భువికి దిగివచ్చిన అప్సరస, అతిలోక సుందరి. కుర్రాళ్ళ కాలేజీ పుస్తకాలు, పర్స్ లు తెరిచి చూస్తే ఆమె ముగ్ధ మనోహర రూపం దర్శనమిచ్చేది. నిద్రలో వచ్చే కళలు సైతం మరిపించి ఇది నిజమా అన్న భ్రమలోకి తీసుకెళ్ళిన అరుదైన సుందర రూపం ఆమె సొంతం.

దాదాపు ఆమె నటించి, నర్తించిన అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఓ సందర్భంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు రానటువంటి జనం జయమాలిని షూటింగ్ చేస్తున్నప్పుడు తండోపతండాలుగా రావడం ఎన్టీ రామారావు గారిని ఆశ్చర్యానికి గురి చేసింది. తలుపులకు తాళం వేసి షూటింగ్ జరుగుతుంటే కుర్రకారు ఎగబడి చూసేవారు.

ఓ సుబ్బారావు..ఓ అప్పారావు.. నీ ఇల్లు బంగారం గాను.. గుడివాడ వెళ్లాను..గుంటూరు వెళ్లాను.. సన్నజాజులోయ్.. లాంటి కైపెక్కించే వందలాది పాటలకు నర్తించి కుర్రకారు మతులు పోగొట్టి వారి గుండెల్లో జెండా పాతిన ఆనాటి క్లబ్ డాన్సర్ జయమాలిని.

ఓ సాధారణ కుటుంబానికి చెందిన తల్లిదండ్రులకు తమ ఎనిమిది మంది సంతానంలో పెద్దమ్మాయి జ్యోతిలక్ష్మి కాగ చిన్నమ్మాయి అలివేలు మంగ. సినిమా చర్చలో భాగంగా జ్యోతిలక్ష్మి ఇంటికి వచ్చిన కె.ఎస్.ఆర్.దాస్ చిన్నమ్మాయి అలివేలు మంగ గురించి చెప్పడంతో విఠలాచార్య స్పందించి ఆ అమ్మాయి బాగుందని తాను తీయబోయే సినిమా “ఆడదాని అదృష్టం”లో అలివేలుమంగ పేరును కాస్త జయమాలిని గా మార్చాడు. అప్పటి నుంచి జయమాలిని మకుటంలేని మహారాణిగా తెలుగు సినీ సామ్రాజ్యాన్ని దాదాపు పదిహేను సంవత్సరాలు ఏలారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here