1990 దశకంలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నందమూరి నటసింహ బాలకృష్ణ బి.గోపాల్ దర్శకత్వంలో విజయశాంతితో కలిసి “లారీ డ్రైవర్” చిత్రంతో ఈ దశాబ్దాన్ని ప్రారంభించారు.

ఆ తర్వాత “రౌడీ ఇన్స్పెక్టర్” ఆ తర్వాత “బంగారు బుల్లోడు” లాంటి విజయవంతమైన చిత్రాల్లో బాలకృష్ణ నటించారు.

1993 జగపతి ఆర్ట్ పిక్చర్స్, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో “బంగారు బుల్లోడు” చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో బాలకృష్ణ, రమ్యకృష్ణ, రవీనాటాండన్ హీరో హీరోయిన్లుగా నటించారు. రవీనాటాండన్ మొదటిసారిగా ఈ చిత్రంతో తెలుగులో నటించారు. 1993లో ఒకే రోజున “నిప్పురవ్వ’ “బంగారుబుల్లోడు” చిత్రాలు విడుదలవ్వగా నిప్పురవ్వ బోల్తా కొట్టి, బంగారుబుల్లోడు చిత్రం విజయవంతమయ్యింది.

కిల్లర్, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు లాంటి విజయవంతమైన చిత్రాల జోరులో ఉన్న నాగార్జున మరో హిట్ చిత్రంతో దూసుకు వెళ్లారు. 1995 ఆర్.కె.ఫిల్మ్ అసోసియేషన్స్,కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో “ఘరానాబుల్లోడు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ హీరో, హీరోయిన్లుగా నటించారు. కీరవాణి అందించిన సంగీతం సినిమా విజయానికి ఒక కారణంగా నిలిచింది.

1990 దశాబ్దాన్ని “బొబ్బిలిరాజా” అనే బ్లాక్ బస్టర్ తో వెంకటేష్ ప్రారంభించారు. అలా చంటి, కొండపల్లిరాజా లాంటి విజయవంతమైన చిత్రాల జోరులో ఉండగా “సరదాబుల్లోడు” చిత్రంలో వెంకటేష్ నటించారు. 1996 విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో సరదాబుల్లోడు చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో వెంకటేష్, నగ్మా హీరో, హీరోయిన్లుగా నటించారు. అత్తా అల్లుళ్ళ సవాల్ తో కూడిన కథతో వచ్చిన ఈ చిత్రంలో అత్తగా అలనాటి నటి మంజుల నటించారు. రాజ్ కోటి అందించిన సంగీతం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వెంకటేష్ రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా “సరదా బుల్లోడు” బాక్సాఫీసు వద్ద ఒక ఫ్లాప్ గా మిగిలిపోయింది.
































