1980, సినీగ్రూప్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీరంతా స్టార్ హీరోలుగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ వీరు ఆరు పదుల వయసు దాటినా కూడా సినిమాల్లో నటిస్తూ యువ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా తమ సత్తా చూపుతున్నారు.

పాండమిక్ తో థియేటర్లన్నీ కోలుకోలేని దెబ్బతీశాయి. తెలుగు సినిమా పరిస్థితి ఏంటి అనుకున్న సమయంలో “అఖండ” సినిమాతో బాలకృష్ణ విజయదుందుభి మోగించారు. బాలయ్య బాబు.. 14 సంవత్సరాల వయసులో “తాతమ్మకల” చిత్రంలో బాలనటుడిగా కనిపించారు.

1974 రామకృష్ణ ఆర్ట్స్, ఎన్టీరామారావు దర్శకత్వంలో “తాతమ్మకల” చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, భానుమతి ప్రధాన పాత్రల్లో కనిపించగా.. బాలకృష్ణ బాలనటుడిగా కనిపించారు.

“బంగార్రాజు” చిత్రంతో మంచి ఊపులో ఉన్న నాగార్జున 1986లో వచ్చిన “విక్రమ్” సినిమానే ఆయన మొదటి సినిమా అనుకుంటున్నారు. కానీ 1961 అన్నపూర్ణ పిక్చర్స్, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో “వెలుగునీడలు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో నాగేశ్వరరావు, సావిత్రి హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో సావిత్రి నాగార్జునను ఎత్తుకొని “చల్లని వెన్నెల..అనే పాట పాడుతుంది. అలా నాగార్జున మొదటిసారి వెలుగు నీడలు చిత్రంలో బాలనటుడిగా కనిపించారు.

విక్టరీ వెంకటేష్ “కలియుగ పాండవులు” చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించి.. ప్రస్తుతం దృశ్యం, దృశ్యం-2 లాంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకెళుతున్నారు. 1971 సురేష్ ప్రొడక్షన్స్, డి.రామానాయుడు నిర్మాణం, కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో “ప్రేమనగర్” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ హీరో,హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో బాలనటుడి పాత్ర అవసరం ఉండటంతో ఆ సినిమాకు నిర్మాత అయిన డి.రామానాయుడు ఆయన చిన్న కుమారుడైన వెంకటేశ్ ని బాలనటుడిగా ప్రేమనగర్ సినిమాలో నటింపజేశారు.

ఇక ఆ నలుగురిలో మిగిలిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈయన చిన్నప్పటినుంచే సినిమాలపై అభిమానంతో ఉన్నత చదువులు పూర్తి చేసి మద్రాసులో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పూర్తి చేసి 1978లో “ప్రాణం ఖరీదు” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. కాని బాలనటుడిగా ఏ చిత్రంలోనూ చిరంజీవి నటించలేదు. చిరంజీవి మినహా ముగ్గురు స్టార్ హీరోలు బాలనటులుగా వివిధ సినిమాలలో నటించడం గమనార్హం.






























