ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బెడ్‌షీట్‌ను వెంటనే మడత పెట్టడం వల్ల శరీరానికి హానికరమైన సూక్ష్మక్రిములు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

రాత్రి నిద్రపోతున్నప్పుడు మన శరీరం నుంచి చెమట, తేమ బయటకు వస్తాయి. ఇవి బెడ్‌షీట్, దుప్పట్లలో నిల్వ అవుతాయి. ఉదయం లేవగానే వెంటనే బెడ్‌ను సర్దేస్తే ఆ తేమ బయటకు వెళ్లే అవకాశం తగ్గిపోతుంది. దీనివల్ల బ్యాక్టీరియా, డస్ట్ మైట్స్ పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి చర్మ సమస్యలు, అలర్జీలు, శ్వాసకోశ ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉంది.
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, నిద్రలేవగానే కనీసం 20 నుంచి 30 నిమిషాలు బెడ్‌ను అలాగే ఉంచడం మంచిదని చెబుతున్నారు. కిటికీలు తెరిచి గాలి ఆడేలా చేస్తే తేమ త్వరగా ఆవిరైపోతుంది. తర్వాత బెడ్‌షీట్‌ను సర్దడం ద్వారా పరిశుభ్రతను కూడా కాపాడుకోవచ్చు.
రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి త్వరపడకుండా కొంత సమయం ఇచ్చి బెడ్‌ను సర్దుకోవడం మంచిదని సూచిస్తున్నారు.































