వేసవి కాలం మొదలయ్యాక చాలా ఇళ్లల్లో ఎదురయ్యే సాధారణ సమస్య ఇడ్లీ, దోశ పిండికి సంబంధించినదే. ఉదయం అల్పాహారంలో మెత్తగా, రుచిగా ఉండాల్సిన ఇడ్లీలు కొన్నిసార్లు పుల్లగా మారి నిరాశ కలిగిస్తాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల పిండిలో జరిగే ఫెర్మెంటేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం. దీంతో పిండి అతిగా ఉబ్బిపోవడం, రుచి మారడం జరుగుతుంది.

వంట నిపుణుల మాటల్లో, వేసవిలో పిండిని తయారు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పిండి రుబ్బేటప్పుడు చల్లటి నీటిని ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. ఇది గ్రైండింగ్ సమయంలో ఏర్పడే వేడిని తగ్గించి, పిండిలో జరిగే ప్రక్రియను కొంత నెమ్మదింపజేస్తుంది. దాంతో పిండి త్వరగా పులిసిపోకుండా ఉంటుంది.
ఉప్పు కలపడం విషయంలో కూడా మార్పులు అవసరం. సాధారణంగా పిండి తయారయ్యాక వెంటనే ఉప్పు కలుపుతారు. కానీ ఎండకాలంలో అలా చేయడం వల్ల పులుపు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పిండిని ఉపయోగించే సమయానికే ఉప్పు కలపడం ఉత్తమం. ఇది రుచిని సరిగా ఉంచడంలో సహాయపడుతుంది.
పిండిని నిల్వ చేసే విధానం కూడా చాలా ముఖ్యం. పిండి పూర్తిగా ఉబ్బే వరకు బయట ఉంచకుండా, కొద్దిగా ఫెర్మెంటేషన్ మొదలైన వెంటనే గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. అలాగే గిన్నెను పూర్తిగా నింపకుండా కొంత ఖాళీ ఉంచితే పిండి పొంగినా బయటకు రావడం నివారించవచ్చు.
ఒకవేళ పిండి ఇప్పటికే పుల్లగా మారిపోయిన పరిస్థితిలో కూడా దాన్ని పారేయాల్సిన అవసరం లేదు. అందులో కొద్దిగా కాచి చల్లార్చిన పాలు లేదా తాజా పెరుగు కలిపితే పులుపు కొంత వరకు తగ్గుతుంది. అదనంగా చిటికెడు వంట సోడా కలిపితే ఇడ్లీలు మళ్లీ మెత్తగా రావడానికి సహాయపడుతుంది.
మొత్తానికి వేసవిలో చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే పిండిని వృథా కాకుండా కాపాడుకోవచ్చు. సరైన విధానం పాటిస్తే ప్రతిరోజూ రుచికరమైన, మెత్తటి ఇడ్లీలు ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.


























