తెలుగు ప్రజలు అత్యంత విశిష్టంగా జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటి. కొత్త సంవత్సరానికి నాంది పలికే ఈ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది కొత్త పేరు, కొత్త ఆశలతో ప్రారంభమయ్యే ఈ పండుగకు ఈసారి “పరాభవ” నామ సంవత్సరం అనే పేరు రావడం ఆసక్తికరంగా మారింది. ఈ పేరుతోనే చాలా మందిలో సందేహాలు, భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా “పరాభవ” అనే పదం వినగానే ఓటమి, అపజయం, అవమానం వంటి భావనలు గుర్తుకు వస్తాయి. దీంతో ఈ ఏడాది మొత్తం ప్రతికూలతలే ఉంటాయా అనే ఆందోళన కొందరిలో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఒక నెటిజన్ ఈ పేరుకు సంబంధించిన ఆధ్యాత్మిక అర్థాన్ని వివరించిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ ప్రకారం “పరాభవ” అనే పదాన్ని వేరే కోణంలో చూడాలని సూచిస్తున్నారు. “పరా” అంటే పరా భట్టారిక, అంటే లలితా దేవి. “భవ” అంటే భవుడు, అంటే పరమశివుడు. ఈ రెండు కలిపితే పార్వతీ పరమేశ్వరుల సమగ్రత అని అర్థం చేసుకోవచ్చని ఆ పోస్ట్‌లో వివరించారు. అంటే ఈ సంవత్సరం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కరుణ, రక్షణతో ఉండే కాలమని భావించవచ్చని పేర్కొన్నారు. ఈ భావన ఆధారంగా భయపడాల్సిన అవసరం లేదని, భక్తి, ధర్మం, సత్య మార్గంలో నడిస్తే మంచి ఫలితాలే ఉంటాయని ఆ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక పండితులు కూడా ఇదే విషయాన్ని కొంతవరకు సమర్థిస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం 60 సంవత్సరాల చక్రంలో “పరాభవ” 40వ సంవత్సరంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో “పరా” అనే పదానికి అత్యున్నతం, గొప్పది అనే అర్థం కూడా ఉంది. “భవ” అంటే ఉనికి, స్థితి లేదా పుట్టుక. ఈ రెండింటి సమ్మేళనం ద్వారా ఉన్నత స్థితిని పొందడం అనే భావనను కూడా ఈ సంవత్సరానికి అన్వయిస్తున్నారు. అయితే పదాన్ని నేరుగా అర్థం చేసుకోవడం వల్ల కలిగే అపోహలే ఎక్కువగా వ్యాపిస్తున్నాయని పండితులు చెబుతున్నారు. “పరాభవ” అంటే కేవలం ఓటమి అని మాత్రమే భావించడం సరైనది కాదని, దానికి ఉన్న ఆధ్యాత్మిక, తాత్విక అర్థాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి, ఈ ఉగాది కొత్త సంవత్సరానికి సంబంధించిన పేరు చర్చకు దారి తీసినప్పటికీ, దాని వెనక ఉన్న అర్థం చాలా విస్తృతంగా ఉందని చెప్పవచ్చు. భయాందోళనలకు లోనవకుండా, సంప్రదాయాల ప్రకారం పండుగను ఆనందంగా జరుపుకుంటూ, మంచి సంకల్పాలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలని పండితులు సూచిస్తున్నారు





























