తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేకమైన కామెడీతో చిరస్థాయిగా గుర్తుండిపోయిన నటుడు ఎం.ఎస్. నారాయణ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు కాలానుగుణంగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం, సినీ ప్రయాణం మాత్రమే కాకుండా వ్యక్తిత్వం కూడా ఎంతో ప్రత్యేకమని ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది.

ఒక ఇంటర్వ్యూలో ఎం.ఎస్. నారాయణ తన కెరీర్‌లో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో తానే దర్శకుడిగా మారాల్సి వచ్చిందని చెప్పారు. ఇతర దర్శకులు ముందుకు రాకపోవడంతో తన బిడ్డపై ఉన్న నమ్మకంతో సినిమా తీసానని తెలిపారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా, అది ప్రమోషన్ లోపం వల్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక తన నటనా శైలి గురించి మాట్లాడుతూ, ఇతర నటులను అనుకరించే పారడీ పాత్రలను ఎంతో ఇష్టంగా చేసేవాడినని చెప్పారు. దర్శకుడు చెప్పిన విధంగా పాత్రను చేయడం తన బాధ్యతగా భావించేవాడినని, అందులోనే తన ఆనందం ఉంటుందని తెలిపారు.
ప్రత్యేకంగా ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, తన పారడీ చూసి కృష్ణ కోపపడతారేమో అనుకున్నానని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా ఆయన తన నటనను మెచ్చుకోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపారు. అంతేకాదు, విజయ నిర్మలకు పిలిచి తన గురించి మంచి మాటలు చెప్పారట. ఆ ప్రోత్సాహం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని ఎం.ఎస్. నారాయణ గుర్తు చేసుకున్నారు.
తన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ, కుటుంబంలో జరిగిన కొన్ని విషాద సంఘటనలను కూడా ఆయన పంచుకున్నారు. ముఖ్యంగా తన చెల్లెలి మరణం తనను ఎంతో కలచివేసిందని చెప్పారు. ఆ సమయంలో తాను చిన్న ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో సహాయం చేయలేకపోయానని, ఇప్పటికీ అది తనను బాధిస్తూనే ఉంటుందని తెలిపారు.
ఇలా నవ్వులు పంచిన ఈ గొప్ప నటుడి జీవితం వెనుక ఎన్నో కష్టాలు, భావోద్వేగాలు దాగి ఉన్నాయని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి.































