ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం సరిపోదు. ఆహారం తీసుకున్న తర్వాత పాటించే అలవాట్లు కూడా శరీరంపై పెద్ద ప్రభావం చూపుతాయి. చాలా మంది తెలియకుండానే భోజనం తర్వాత చేసే కొన్ని చిన్న పొరపాట్లు జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో ఇవి గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం చాలా మందికి అలవాటు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది జీర్ణక్రియను మందగింపజేస్తుంది. ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల కడుపులో అసౌకర్యం, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కనీసం అరగంట పాటు నిద్రకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకో సాధారణ అలవాటు భోజనం వెంటనే టీ లేదా కాఫీ తాగడం. ఇది చాలా మందికి రోజువారీ అలవాటుగా మారిపోయింది. అయితే భోజనం తర్వాత వెంటనే టీ లేదా కాఫీ తీసుకుంటే శరీరం ఐరన్ను సరిగా గ్రహించలేకపోతుంది. దీర్ఘకాలంలో ఇది రక్తహీనత సమస్యకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే కనీసం 40–45 నిమిషాల విరామం తర్వాత మాత్రమే ఈ పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అలాగే భోజనం చేసిన వెంటనే బరువైన వ్యాయామం చేయడం, లేదా ఎక్కువగా నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో తిన్న వెంటనే స్నానం చేయడం కూడా రక్తప్రసరణ మార్పులకు కారణమై జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఈ చిన్న విషయాలు సాధారణంగా అనిపించినా ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపగలవు.
భోజనం తర్వాత కొద్దిసేపు నెమ్మదిగా నడవడం, శరీరాన్ని రిలాక్స్ చేయడం వంటి మంచి అలవాట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆహారం ఎంత ముఖ్యమో, దాని తర్వాత తీసుకునే జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చు.



























