ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్‌లో గెలుపు కోసం కేసీఆర్ ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఎన్ని ప్రలోభాలకు పెట్టిన నియోజకవర్గ ప్రజలు తనవెంటే ఉంటారన్నారు. నిరుద్యోగ భృతి, దళితులందరికి దళిత బంధు పథకం అమలుచేయాలని డిమాండ్ చేశారు.

పాదయాత్రలో స్వల్ప అస్వస్థతతకు గురైనా ఈటల వైద్యుల సూచన మేరకు అపోలో ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకున్న రాజేందర్ ఈ రోజు డిశ్చార్జి అయ్యారు. తనకు మెరుగైన వైద్యం అందించిన అపోలో ఆసుపత్రి సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డిశ్చార్జి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తెరాసలో తెలంగాణ ఉద్యమకారులు కనుమరుగయి ఉద్యమ ద్రోహులంతా తెరపైకి వచ్చారని మండిపడ్డారు. ఉద్యమకారులపై రాళ్లు రువ్విన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారని విమర్శించారు.































