ప్రకృతి మనకు అందించిన ఆరోగ్యకరమైన పండ్లలో ద్రాక్షకు ప్రత్యేక స్థానం ఉంది. తీపి, పులుపు కలగలిసిన రుచితో అందరికీ ఇష్టమైన ఈ పండ్లు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మార్కెట్లో సాధారణంగా ఆకుపచ్చ, నలుపు రంగుల్లో లభించే ద్రాక్షల్లో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ రెండు రకాల ద్రాక్షల్లోనూ పోషకాలు ఉన్నప్పటికీ, వాటి గుణాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి.

ఆకుపచ్చ ద్రాక్షల్లో విటమిన్ సి, విటమిన్ కె వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడటంతో పాటు ఎముకలను బలంగా ఉంచుతాయి. తరచూ జలుబు, దగ్గు సమస్యలు ఎదురయ్యే వారు ఆకుపచ్చ ద్రాక్షను ఆహారంలో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వీటిలో ఉన్న పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధక సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
మరోవైపు నలుపు ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆంథోసైనిన్స్, రెస్వెరాట్రాల్ వంటి పదార్థాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అందువల్ల గుండె సంబంధిత సమస్యలను నివారించాలనుకునే వారు నలుపు ద్రాక్షను తీసుకోవడం మంచిదిగా భావిస్తారు.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా నలుపు ద్రాక్ష ఎంతో ఉపయోగకరం. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యంగా కనిపించేలా చేస్తాయి. అలాగే జుట్టు బలంగా పెరగడానికి కూడా తోడ్పడతాయి. కంటి ఆరోగ్యానికి సంబంధించి కూడా నలుపు ద్రాక్ష మంచి ప్రయోజనాలు అందిస్తాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయని చెబుతున్నారు.
ఇక మొత్తం మీద చూస్తే, ఆకుపచ్చ ద్రాక్ష మరియు నలుపు ద్రాక్ష రెండూ ఆరోగ్యానికి మేలు చేసే పండ్లే. అయితే గుండె ఆరోగ్యం, యాంటీ ఏజింగ్ ప్రయోజనాల దృష్ట్యా నలుపు ద్రాక్ష కొద్దిగా మెరుగ్గా ఉండగా, రోగనిరోధక శక్తి పెంపు, జీర్ణక్రియకు ఆకుపచ్చ ద్రాక్ష ఉపయోగపడుతుంది.
ఏదైనా అధికంగా తీసుకోవడం మంచిది కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ద్రాక్షను తినే ముందు ఉప్పు నీటిలో బాగా కడగడం ఆరోగ్యానికి మంచిది. సహజంగా లభించే ఈ పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.



























