చైనాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష రంగానికి పెద్ద షాక్ తగిలింది. దేశీయంగా అభివృద్ధి చేసిన శక్తివంతమైన రాకెట్ ప్రయోగం విఫలమవడంతో వాణిజ్య అంతరిక్ష పోటీలో చైనాకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. అంతర్జాతీయంగా ప్రైవేటు స్పేస్ సంస్థల మధ్య పోటీ పెరుగుతున్న సమయంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

బీజింగ్‌కు చెందిన స్పేస్ పయనీర్ సంస్థ అభివృద్ధి చేసిన ‘తియాన్‌లాంగ్-3’ రాకెట్‌ను ప్రయోగించారు. ఇది స్పేస్ ఎక్స్ రూపొందించిన ఫాల్కన్ 9కు పోటీగా రూపొందించబడిన ఆధునిక రాకెట్‌గా భావిస్తున్నారు. భారీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే సామర్థ్యంతో దీనిని రూపొందించినట్లు సమాచారం.
అయితే ప్రయోగం ప్రారంభంలో సవ్యంగా సాగినప్పటికీ, కొద్ది నిమిషాలకే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో రాకెట్ నిర్దేశించిన కక్ష్యలోకి చేరకముందే విఫలమైంది. ఈ ఘటనపై సంస్థ అధికారులు స్పందిస్తూ, లోపాల కారణాలను గుర్తించేందుకు సమగ్ర విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ ప్రయోగం చైనాలోని డాంగ్‌ఫెంగ్ కమర్షియల్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ కేంద్రం నుంచి నిర్వహించబడింది. ప్రయోగం విఫలమవడంతో భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, తదుపరి ప్రయోగాలను విజయవంతం చేయడానికి అవసరమైన మార్పులు చేపడతామని సంస్థ వెల్లడించింది.
ప్రైవేటు అంతరిక్ష రంగంలో అమెరికా సంస్థలు ముందంజలో ఉండగా, చైనా కూడా తమ సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో తాజా విఫలం తాత్కాలికమైనదే అయినప్పటికీ, పోటీ తీవ్రతను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.



























