మాస్ మహారాజ్ రవితేజ కెరీర్‌లో 75వ సినిమాగా రానున్న “మాస్ జాతర” సినిమాపై అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న రవితేజ, ఈ సినిమాతో ఒక మైలురాయిని చేరుకోవడంతోపాటు, హిట్ కొట్టాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే, ఈ సినిమా విడుదల తేదీపై నెలకొన్న అనిశ్చితి అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

రెండుసార్లు వాయిదా
“మిస్టర్ బచ్చన్” తర్వాత భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మొదట ఈ సినిమాను జూలై 18న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆగస్టు 27కి వాయిదా వేశారు. ఆ తేదీ వినాయక చవితి సెలవు, వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో పాజిటివ్‌గా ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు ఆగస్టు 27న కూడా ఈ సినిమా రావడం కష్టమేనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
యూనిట్ సమ్మె, నిర్మాతపై అసహనం
సినిమా యూనిట్ సభ్యుల సమ్మె కారణంగా ఫైనల్ కాపీ సమయానికి రెడీ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై నిర్మాత నాగవంశీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు, నాగవంశీ “వార్ 2” అనే డబ్బింగ్ సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టడం కూడా రవితేజ అభిమానులను అసహనానికి గురిచేస్తోంది.
రవితేజ కెరీర్‌లో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ 75వ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియక అభిమానులు వేచిచూస్తున్నారు. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వస్తుందని ఆశిద్దాం.



























