మారుతున్న కాలంతో పాటే మనుషుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దేశంలోని చాలామంది ఆహారం విషయంలో ఆరోగ్య ప్రయోజనాలతో పోలిస్తే రుచికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా చాలామందిని చిన్న వయస్సులోనే బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. 30 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు సైతం గుండెజబ్బుల బారిన పడుతున్నారంటే తీసుకొనే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

చాలామందిలో గుండెదడ, ఛాతీలో నొప్పి, గుండె బరువుగా అనిపించడం లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. పనిఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిని గుండె సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. ఛాతీ నొప్పిగా ఉంటే జీవన శైలి, ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి. మంచి జీవనశైలి నియమాలను పాటించాలి. జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం ద్వారా ఛాతీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
తరచూ ఛాతీలో నొప్పి వస్తుంటే హృద్రోగ నిపుణులను సంప్రదించి గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబాల్లో ఎవరికైనా గుండె సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. చాలామందిలో మొదట బీపీ సమస్య కనిపించి ఆ తరువాత గుండెపోటుకు దారి తీస్తుంది. ఛాతీలో నొప్పి గుండె రుగ్మతకు సూచన అని గుర్తుంచుకోవాలి.
కొన్ని సందర్భాల్లో అజీర్తి వల్ల లేదా ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల గుండె సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. వెల్లుల్లి రసం, కలబంద రసం తీసుకోవడం ద్వారా తాత్కాలికంగా గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు. హెర్బల్ టీ కూడా ఛాతీలోని నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.






























