Film Federation : కరోనా సంక్షోభం వల్ల అన్ని వ్యవస్థలు అవస్థ పడ్డాయి. ఇక సినిమా ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండేళ్లు కరోనా వల్ల చాలా మంది కార్మికులు, సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు నష్టపోయారు. కరోనా తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినిమా ఇండస్ట్రీ లో జోరుగా షూటింగులు జరుగుతున్నాయి. చేతి నిండా పని దొరుకుతోంది. అయితే సినీ కార్మికుల జీతాలు మాత్రం పెరగలేదు.
సమ్మె సైరన్ మోగించిన కార్మికులు…

జీతాలు పెంచమని నిర్మాతల మండలిని ఎన్నో సార్లు అడిగినా ఫలితం లేదు. ఇక ఫిల్మ్ ఫెడరేషన్ కూడా పట్టించుకోక పోవడంతో సినిమా కార్మికులు రేపటి నుండి అంటే జూన్ 22 నుండి సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సినిమా పరిశ్రమలో 24 కార్మిక విభాగాలు ఉన్నాయి. రేపు సమ్మెలో ఈ 24 విభాగాలు పాల్గొంటాయి.
రేపు ఫిలిం ఛాంబర్ ముట్టడికి 24 యూనియన్లు పిలుపునిచ్చాయి. వేతనాలు పెంచకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని యూనియన్లు భావిస్తున్నాయి. వేతనాలు పెంచే వరకూ షూటింగులు జరగవని స్పష్టం చేస్తున్నారు. మా డిమాండ్లను నెరవేర్చేవరకు సహాయనిరాకరణ కొనసాగిస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కీలకమైన 24 విభాగాలకు సంబంధించిన కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో షూటింగులు జరగడం కష్టమే అని అందరూ భావిస్తున్నారు.
































