స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజు కావడంతో, ఈ వేడుక మరింత స్పెషల్‌గా మారింది.

తన భర్త, నటుడు విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక తన సొంతూరు అయిన కూర్గ్లో ఈ వేడుకను జరుపుకున్నారు. ఏప్రిల్ 5న జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా రష్మిక తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చిన్నప్పటి నుంచి వెళ్తున్న గుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమయం లేకపోవడంతో తాను చదువుకున్న పాఠశాలను బయట నుంచి చూసి భావోద్వేగానికి లోనయ్యారు.
అలాగే, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్లో జరిగిన తమ వివాహానికి హాజరు కాలేకపోయిన కుటుంబ సభ్యులు, బంధువులను ఈసారి ప్రత్యేకంగా కలుసుకున్నారు. వారితో కలిసి డిన్నర్ ఏర్పాటు చేసి సంతోషంగా గడిపారు. తన పాఠశాల స్నేహితులతో కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఈ వేడుకపై స్పందిస్తూ రష్మిక, “ఈసారి నా 30వ పుట్టినరోజు కాస్త భిన్నంగా గడిచింది. చాలాకాలం తర్వాత ఇంటికి వెళ్లాను. జీవితంలో జరిగే ప్రతిదీ ఒక మంచి కారణం కోసమేనని అనిపిస్తోంది. ఇప్పుడు అన్నీ సార్థకంగా ఉన్నాయి” అంటూ భావోద్వేగంగా పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 26న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండలు ఉదయ్‌పూర్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే



























