అమెరికాలోని జార్జియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదంలో మొత్తం ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తుల తో పాటు ఆ విమాన పైలెట్ కూడా ఈ ప్రమాదంలో మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే ఫ్లోరిడాకు చెందిన షాన్ చార్ల్స్ లామోంట్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇండియానాలో జరిగే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ విమాన ప్రమాదం సంభవించింది.

రెండు ఇంజిన్లు గల టర్బో విమానం విల్‌స్టన్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది.. జార్జియాలోని ఈటన్టన్‌కు ఈశాన్యంగా ఆరు మైళ్ల దూరంలో టాన్వార్డ్ రోడ్ సమీపంలోని దట్టమైన అడవుల్లో కూలిపోయింది. అయితే ఈ విమానం కూలిపోతున్న దృశ్యాలను ఓ వ్యక్తి తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేసారు. ఆ వీడియోలో విమానం కూలడానికి ముందే మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. విమాన ప్రమాదానికి ఆకస్మాత్తుగా వచ్చిన తుఫాను కారణంఅని పోలీసులు భావిస్తున్నారు.



























