పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు, ఆహారం మధ్యలో చనిపోయిన ఈగ కనిపించడంతో అతను తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. హోటల్ సిబ్బందిని ప్రశ్నించినప్పటికీ తగిన సమాధానం రాకపోవడంతో, అతను జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు.

ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఫోరమ్, హోటల్ సేవల్లో లోపం ఉన్నట్లు నిర్ధారించింది. దాంతో బాధితుడికి రూ.13,000 నష్టపరిహారం చెల్లించాలని హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఇందులో రూ.10,000 పరిహారం, రూ.3,000 కోర్టు ఖర్చులు ఉన్నాయి.
ఇక ఆసక్తికరంగా, ఫోరమ్ ఒక వినూత్న నిర్ణయం కూడా తీసుకుంది. బాధితుడికి ఐదు వారాల పాటు ప్రతి ఆదివారం రెండు ప్లేట్ల చొప్పున మొత్తం 10 ప్లేట్ల చికెన్ బిర్యానీని ఉచితంగా అందించాలని ఆదేశించింది. ఈ తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఈ ఫోరమ్ ద్వారా, నాణ్యత లేని సేవలు లేదా మోసపూరిత వ్యవహారాలపై సులభంగా న్యాయం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.



























