అనంతపురం: తాడిపత్రి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తన స్వస్థలమైన తాడిపత్రికి చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన తిరిగి తాడిపత్రిలోకి ప్రవేశించారు.

జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదం
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలోకి రానివ్వకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామంతో పెద్దారెడ్డికి, జేసీకి మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. ఈ ఆంక్షలను సవాల్ చేస్తూ పెద్దారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తాడిపత్రిలో తిరిగి అడుగుపెట్టారు.
భారీ పోలీస్ భద్రత మధ్య పెద్దారెడ్డి రాక
తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన పోలీస్ కాన్వాయ్ మధ్య పెద్దారెడ్డి తన స్వగృహానికి చేరుకున్నారు. ఇంటి వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పెద్దారెడ్డికి హారతి ఇచ్చి దిష్టి తీయడం వంటి సంప్రదాయ ఆచారాలతో కుటుంబ సభ్యులు ఆయన రాకను సంతోషంగా స్వాగతించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ అయినప్పటికీ, తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



































