మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నటుడు ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడకూడదని ఆయన సూచించారు.

ముందుగా ఈ బిల్లు అమలులో ఆలస్యం కావడానికి ప్రతిపక్షాలే కారణమని చంద్రబాబు, పవన్ అభిప్రాయపడ్డారు. ఇది మహిళలకు అన్యాయం చేస్తోందని, చారిత్రక అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వారు వ్యాఖ్యానించారు.
దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్, మహిళా రిజర్వేషన్ చట్టం ఇప్పటికే ఆమోదం పొందిందని గుర్తుచేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం దానిని డీలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానం చేయడం వెనుక ఉద్దేశ్యం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అదే సమయంలో, ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. అలాగే చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాతో పాటు రాజకీయ వేదికలపై హాట్ టాపిక్‌గా మారింది.


































