Girija Shetter : 1989లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాగార్జున, గిరిజ కలిసి నటించిన సినిమా గీతాంజలి. ఈ సినిమా వచ్చినప్పటికి ఇప్పటి తరంలో చాలా మంది పుట్టనే లేదు కానీ ఈ సినిమా, ఈ సినిమాలోని పాత్రలు, పాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇలాంటి క్లాసిక్ సినిమాను ఇప్పటికీ టీవీలో వస్తే చూస్తూ ఉంటాం. అయితే గీతాంజలి సినిమాలోని గీత పాత్రలో నటించిన గిరిజ ఆ తరువాత ఒకటో రెండో సినిమాల్లో నటించి ఆ తరువాత కనుమరుగయింది. ఇక మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇన్నేళ్ల తరువాత గీతాంజలి ఫేమ్ గిరిజ ఎక్కడుంది, ఏం చేస్తోందో అన్న వివరాలు ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

గీతాంజలి అవకాశం ఎలా వచ్చింది…
గిరిజ పుట్టింది పెరిగింది ఇంగ్లాండ్ దేశంలోని ఎస్స్ఎక్స్ అనే ప్రాంతం. ఆమె తండ్రి డాక్టర్, ఇక తల్లి వ్యాపారవేత్త, ఒక సోదరుడు ఉన్నారు. ఇక గీతాంజలి సినిమాలో అవకాశం ఎలా వచ్చిందనే విషయాన్ని గిరిజ చెప్పారు. గిరిజ భరతనాట్యం నేర్చుకోవడం కోసం చెన్నైకి రాగా అక్కడ శ్రీకళ భరత్ దగ్గర భరత నాట్యం నేర్చుకుంటుండగా, కళ గారి సోదరుడు కృష్ణమాచారి శ్రీకాంత్ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ ద్వారా మణిరత్నం, సుహాసిని గారి పెళ్ళికి హాజరయ్యాను. అక్కడ మణిరత్నం గారి సోదరుడు జీవి నన్ను చూసి సినిమాలో నటిస్తారా అని అడుగగా, సరే అని చెప్పగా స్క్రీన్ టెస్టు కి పిలిచి గీతాంజలిలో అవకాశం ఇచ్చారు అంటూ చెప్పారు గిరిజ.

ఇక గీతాంజలి సినిమాలో నాగార్జునతో కలిసి నటించిన గిరిజ నాగార్జున గారి గురించి అడుగగా చాలా మర్యాదగా, సరదాగా ఉంటారని మాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు. చాలా మంది గీతాంజలి సినిమా గురించి పాజిటివ్ గా చెబుతున్నపుడు చాలా ఆనందంగా ఉంటుందని, ఆ సినిమాకు చాలా అవార్డులు వచ్చాయని, నంది అవార్డు కూడా వచ్చిందని చెప్పారు. ఇక ఆ సినిమా తరువాత మలయాళంలో ఒక సినిమా చేసానని ఆ సినిమా కూడా మంచి హిట్ అలాగే అవార్డ్స్ వచ్చాయని, ఇక అమీర్ ఖాన్ సరసన ఒక సినిమా చేయగా అది కూడా మంచి హిట్ అని చెప్పారు. ఇక తెలుగులో చేసిన హృదయాంజలి సినిమాకు కూడా నంది అవార్డు వచ్చిందని చెప్పారు గిరిజ.

































