టాలీవుడ్లో ఒకప్పుడు యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి హీరోగా కాకుండా, కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయి.

తాజాగా శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం బైకర్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంచి పాత్రల కోసం తాను చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని, సరైన కథ దొరికితే ఎలాంటి పాత్రకైనా సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
గతంలో పలు కథలు విన్నప్పటికీ, తనకు నచ్చిన పాత్ర దొరకలేదని ఆయన చెప్పారు. దాదాపు రెండేళ్ల తర్వాత దర్శకుడు అభిలాష్ చెప్పిన కథలోని పాత్ర తనను ఆకట్టుకుందని తెలిపారు. ఈ సినిమాలో శర్వానంద్ తండ్రి పాత్రలో కనిపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇక పాత్రల విషయంలో తన ఆలోచనల్లో మార్పు వచ్చిందని రాజశేఖర్ స్పష్టం చేశారు. “ముందు హీరోగానే ఉండాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు మంచి పాత్ర అయితే చాలు, ఎలాంటి పాత్ర అయినా చేస్తాను” అని ఆయన అన్నారు. అందరూ మంచి క్యారెక్టర్లు ఉంటే తనను సంప్రదించాలని కోరడం కూడా ఆసక్తికరంగా మారింది.
సినిమా షూటింగ్ అనుభవాన్ని పంచుకుంటూ, యూనిట్ అందరూ తనను ఎంతో గౌరవంగా చూసుకున్నారని ఆయన చెప్పారు. శర్వానంద్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా అనిపించిందని, ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో పలువురు సీనియర్ నటులు విలన్ లేదా క్యారెక్టర్ రోల్స్‌లో తిరిగి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అదే దారిలో రాజశేఖర్ కూడా ముందుకు రావడంతో, ఆయన కెరీర్‌కు ఇది కొత్త మలుపు కావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు



























