దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో మనందరికీ తెలిసిందే. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం, ప్రభావవంతంగా పని చేసే మందులు లేకపోవడంతో వైరస్ ను కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో కొన్ని సఫలమవుతుంటే మరికొన్ని విఫలమవుతున్నాయి.

అయితే తాజాగా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు కృషి చేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే వ్యాక్సిన్ ను తయారు చేయనున్నట్టు ప్రకటన చేసింది. ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మంచి ఫలితాలు సాధిస్తామని తమపై తమకు నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు జాన్సన్ అండ్ జాన్సన్ చేసిన ప్రయోగ పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధించింది.
ఈ వ్యాక్సిన్ ను పెరూ, మెక్సికో, కొలంబియా, చిలీ, బ్రెజిల్, ఇతర దేశాల్లో 60 వేల మంది వాలంటీర్లకు తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఇవ్వనున్నారని సమాచారం. జాన్సన్ అండ్ జాన్సన్ అధికారులు మాట్లాడుతూ సాధారణంగా ఒక వ్యాక్సిన్ ను మెరుగైన ఫలితాల కోసం రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుందని అయితే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ ను తాము అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.
జాన్సన్ అండ్ జాన్సన్ అధికారి పాల్ స్టోఫెల్స్ ఈ విషయాలను వెల్లడించారు. మరోవైపు నవంబర్ లోపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటనలు వెలువడుతున్నా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం అసాధ్యమని తెలుస్తోంది. 2020 చివరినాటికి లేదా 2021 మొదటినాటికి కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.



























