నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్..?

0
280

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. గతంలోనే ఈ పోస్టుల భర్తీ జరగాల్సి ఉన్నా కోర్టు కేసులు నమోదు కావడంతో ఉద్యోగ నియామక ప్రక్రియ అంతకంతకూ వాయిదా పడుతూ వస్తోంది.

కోర్టు కేసులన్నీ ఇప్పటికే క్లియర్ కావడంతో ఆ పోస్టుల భర్తీ చేపట్టే దిశగా మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను ఆరు నెలలు లేదా సంవత్సరంలో భర్తీ చేయాలని మంత్రి వర్గ ఉపసంఘం భావిస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షతన నిన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అధికారులు హాజరయ్యారు.

మంత్రి కేటీఆర్ వైద్య, ఆరోగ్య శాఖ గడిచిన ఆరు నెలల నుంచి అద్భుతంగా పని చేస్తోందని.. కరోనా వైరస్ విజృంభణ వల్ల వైద్య, ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన బాగా పెరిగిందని ఫలితంగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టాయని కేటీఆర్ వెల్లడించారు. మంత్రి ఈటల త్వరలో ప్రభుత్వ మెడికల్‌ షాపులను ఏర్పాటు చేయనున్నామని కీలక ప్రకటన చేశారు.

ఈ మెడికల్ షాపుల ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులను అందించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు వైద్యం అందేలా మంత్రివర్గ ఉపసంఘం కీలక సూచనలు చేసింది. తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో ప్రతిరోజూ 10 వేల పరీక్షలు జరుగుతుండగా 60 రకాల పరీక్షలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం త్వరలో 100 కొత్త ఆంబులెన్స్ లను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here