మన రోజువారీ వంటల్లో తరచుగా కనిపించే క్యాప్సికమ్ గురించి చాలా మందికి ఒక సందేహం ఉంటుంది – పచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో ఉండే ఇవి వేర్వేరు కూరగాయలేనా? లేక ఒకే మొక్కకు చెందినవేనా? నిజానికి, ఇవన్నీ ఒకే మొక్కకు చెందినవి. కానీ వాటి రంగులు మాత్రం అవి ఉన్న ముదిర్చి దశను సూచిస్తాయి.

ప్రారంభంలో క్యాప్సికమ్ పచ్చగా ఉంటుంది. ఇది ఇంకా పూర్తిగా పక్వానికి రాని దశ. కొంతకాలం తర్వాత అదే కాయ పసుపు రంగులోకి మారుతుంది. చివరికి పూర్తిగా పండినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ మార్పు కేవలం రంగులోనే కాదు, రుచి, పోషక విలువల్లో కూడా కనిపిస్తుంది.
పచ్చి క్యాప్సికమ్ కొద్దిగా వగరుగా, తక్కువ తీపితో ఉంటుంది. అందుకే దీనిని ఎక్కువగా కూరల్లో వాడుతారు. అదే ఎరుపు రంగులోకి మారే కొద్దీ తీపి పెరుగుతుంది. అందువల్ల సలాడ్లు, పిజ్జాలు వంటి వంటకాల్లో ఎరుపు క్యాప్సికమ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు.
పోషక విలువల పరంగా చూస్తే, రంగు మారే కొద్దీ క్యాప్సికమ్‌లోని పోషకాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి శక్తివంతమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పచ్చి క్యాప్సికమ్‌లో కూడా పోషకాలు ఉన్నప్పటికీ, ఎరుపు రంగులోకి మారిన తర్వాత అవి మరింత సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల అధిక పోషకాలను పొందాలనుకునేవారు ఎరుపు క్యాప్సికమ్‌ను డైట్‌లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, ఒక్క రంగు క్యాప్సికమ్ మాత్రమే కాకుండా, అన్ని రంగుల క్యాప్సికమ్‌లను కలిపి తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ప్రతి రంగులో వేర్వేరు ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవన్నీ కలిపి తీసుకున్నప్పుడు శరీరానికి సమగ్ర పోషకాలు అందుతాయి.
మొత్తం మీద, క్యాప్సికమ్ రంగులు కేవలం ఆకర్షణ కోసం కాదు. అవి ఆ కాయలోని పోషక స్థాయిని తెలియజేసే సూచికలు. కాబట్టి ఇకపై మార్కెట్‌కి వెళ్లినప్పుడు పచ్చితో పాటు ఎరుపు, పసుపు క్యాప్సికమ్‌లను కూడా మీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది

































