GV Narayanarao : నవయుగ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జీవీ ప్రసాద్ గారి కొడుకు జీవీ నారాయణ రావు గారు, కే. బాలచందర్ గారి అంతులేని కథ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన నారాయణ గారు, ఆ తరువాత సినిమా ప్రొడక్షన్ లో అడుగుపెట్టి యముడికి మొగుడు, చట్టానికి కళ్ళు లేవు వంటి సినిమాలను నిర్మించారు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చాలా సినిమాల్లో నటించిన ఆయన ఇంట్రస్టింగ్ విషయాలను పలు ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు.

అన్నపూర్ణ స్టూడియో మా నాన్న వల్లే నాగేశ్వరావు గారు కట్టించారు…
నాగేశ్వరావు గారంటే పుట్టినప్పటి నుండి అభిమాన నటుడంటూ చెప్పిన నారాయణరావు గారు, అన్నపూర్ణ స్టూడియోస్ ఆవిర్భావం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగేశ్వరావు గారి చాలా సినిమాలు సారథి స్టూడియో లోనే షూటింగ్ జరిగేవి. ఇక సారథి స్టూడియో జీవీ నారాయణ గారి తండ్రిది కావడంతో నాగేశ్వరావు గారితో ముందునుండి మంచి అనుబంధం ఉండేది. అది కాక నవయుగ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నాగేశ్వరావు గారి చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల అనుబంధం ఉందని వివరించారు.

ఇక నాగేశ్వరావు గారికి పెళ్లి కుదిర్చింది కూడా నారాయణ రావు గారి నాన్న ప్రసాద్ గారేనట. నాగేశ్వరావు గారు గుండె ఆపరేషన్ చేయించుకోడానికి అమెరికా వెళ్ళినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు దేవదాస్ సినిమా రీమేక్ చేయాలని భావించి నవయుగ వారిని అడుగగా ఆలోచన బాగుందని ఒప్పుకున్నారు. ఒక క్లాసిక్ సినిమాను రీమేక్ చేయడం ఏమిటని నాగేశ్వరావు గారికి చాలా కోపం వచ్చి నవయుగ ప్రసాద్ గారితో గొడవ పడ్డారు, ఇక సారథి స్టూడియోలో స్ట్రైక్ కారణంగా తనే ఒక స్టూడియో నిర్మించాలని నాగేశ్వరావు గారు సంకల్పించి అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు. అలా ప్రసాద్ గారితో గొడవ అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటుకు దోహదపడింది. ఇక ఇదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరావు గారు చాలాసార్లు నారాయణ గారితో ప్రస్తావించే వారట. మీ నాన్న వల్లే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించానని, నా పిల్లలకు మంచి అస్థి చేయగలిగానని చెప్పారట.




























