వరంగల్, తెలంగాణ: వరంగల్‌లో వివాహేతర సంబంధం ఒక యువతి, ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. కూతురు వయసున్న యువతిని లోబరుచుకుని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి, చివరకు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళ్తే..
వరంగల్ ఎనుమాముల ఇందిరమ్మ కాలనీకి చెందిన 22 ఏళ్ల గాయత్రి ఇంటర్ మధ్యలోనే ఆపేసి ఇంట్లో ఉంటోంది. వీరి ఇంటి ఎదురుగా ఉండే 42 ఏళ్ల డీసీఎం డ్రైవర్ వేల్పుగొండ స్వామికి అప్పటికే పెళ్లై, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయినా గాయత్రిని మాయమాటలు చెప్పి లోబరుచుకుని ప్రేమాయణం సాగించాడు.
పెద్దల పంచాయతీ.. ఆ తర్వాత ఏమైందంటే..
ఈ విషయం తెలుసుకున్న గాయత్రి తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పెద్దలు మందలించడంతో స్వామి తన మకాంను హన్మకొండకు మార్చాడు. అయితే, గాయత్రితో రహస్యంగా సంబంధాన్ని కొనసాగించాడు.
గాయత్రికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు భావిస్తుండగా, ఈ నెల 2వ తేదీన ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. 10 తులాల బంగారం, నగదు తీసుకుని స్వామితో కలిసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇంట్లోంచి వెళ్ళిపోయిన గాయత్రి, స్వామితో కలిసి విజయవాడ, గుంటూరులలో గడిపింది. ఆ తర్వాత వేములవాడలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఆత్మహత్యాయత్నం, విషాద ముగింపు
అనంతరం అన్నారం షరీఫ్‌కు వచ్చిన ఇద్దరూ ఒక అద్దె గది తీసుకున్నారు. ఈ బంధం నిలబడదని భావించిన స్వామి, గాయత్రిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు సమాచారం. దీంతో ఇద్దరూ పురుగుల మందు తాగారు.
ఘటనా స్థలంలోనే స్వామి మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న గాయత్రిని రూమ్ యజమాని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రూమ్ యజమాని సమాచారం ఇవ్వడంతో గాయత్రి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయత్రి తన తండ్రితో, “నాన్న నన్ను బ్రతికించు, నాకు చచ్చిపోవాలని లేదు” అంటూ ప్రాణాలు విడిచింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



























