Plane Crash : టాటా గ్రూప్ ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక మహిళ వారికే రెండు కోట్ల రూపాయలు తిరిగి ఇస్తానని చెబుతోంది. ఆమె డిమాండ్ ఏమిటంటే… “మీరు నా తండ్రిని ప్రాణంతో తిరిగి తెచ్చేయండి!” ఆమె తండ్రి ఈ ప్రమాదంలో మరణించారు. అతని శరీరం కూడా గుర్తించలేనంతగా కాలిపోయింది. ఆమె కన్నీళ్లతో చెప్పిన మాటలు ఎవరి హృదయాన్ని కదిలించకపోవు.

“మీ పరిహారం నాకు ఎందుకు? నా తండ్రి లేకుండా ఆ డబ్బు ఏమి చేస్తుంది? నేను మీకు రెండు కోట్లిస్తాను, కానీ మీరు నా నాన్నను బతికించి తిరిగి తెండి! ఆయన నవ్వులు, ఆప్యాయత, అన్నీ నాకు తిరిగి కావాలి…” అంటూ ఫాల్గుని అనే ఆ మహిళ మనస్ఫోటం చేసుకుంది.
ఫాల్గునితో పాటు అనేక బాధిత కుటుంబాలు అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ వద్ద ఎదురు చూస్తున్నారు. విమానంలో మరణించిన వారి శరీరాలు గుర్తించడం కష్టమైన స్థితిలో ఉన్నాయి. డీఎన్ఏ టెస్టింగ్ జరుగుతోంది, కానీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. కుటుంబ సభ్యులు ఫలితాల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. “ఇంకెప్పుడు మా వాళ్లను ఇస్తారు? ఇంత జాప్యం ఎందుకు?” అని వారు అధికారులను కసితో ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, అధికారులు తమ బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెబుతున్నారు. “240 మృతదేహాల డీఎన్ఏ టెస్టులు పూర్తయ్యాయి. మ్యాచింగ్ పూర్తయిన వెంటనే శవాలను అప్పగిస్తాం” అని వారు చెప్పారు. కానీ బాధిత కుటుంబాలకు ఇది ఎంతో కష్టమైన కాలం.
ఈ విషాదంలో ప్రతి ఒక్కరి హృదయం బాధతో నిండిపోతోంది. డబ్బు కాదు, వారి ప్రియమైనవారి జీవితాలే వారికి కావాలి. ఈ దుఃఖం ఎప్పటికీ మరచిపోలేనిది.































