మహారాష్ట్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పుణే జిల్లా పరిధిలో త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. ముందుగా సిద్ధం చేసిన హెలిప్యాడ్‌ను మిస్ అవడంతో, సమీపంలోని వాహనాల పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ దిగింది. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ, ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

పురందర్ తాలూకాలోని ఖన్‌వాడి గ్రామానికి మంత్రి ఒక కార్యక్రమం కోసం వెళ్తుండగా ఈ పరిస్థితి ఏర్పడింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ రెక్కల గాలికి దుమ్ము మేఘాలు ఎగసిపడటంతో పైలట్‌కు హెలిప్యాడ్ స్పష్టంగా కనిపించలేదు. ఈ పరిస్థితిని ‘బ్రౌనౌట్’గా పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. దీంతో పైలట్ సమీపంలో ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించి జాగ్రత్తగా హెలికాప్టర్‌ను దించాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం హెలికాప్టర్‌ను తిరిగి నిర్దేశిత హెలిప్యాడ్‌కు తరలించారు.
ఇలాంటి పరిస్థితులు దుమ్ము ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. చిన్న అంతరాయం తప్ప మరే సమస్య లేకుండా మంత్రి తన పర్యటనను కొనసాగించారు. అధికారులు దీనిపై ప్రత్యేక విచారణకు అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం.



























