Hero Srikanth : ఒక్కో మెట్టు ఎక్కుతూ విలన్ గా మొదలై సెకండ్ హీరో క్యారెక్టర్ చేస్తూ ఆ తరువాత సోలో హీరోగా ఎదిగిన శ్రీకాంత్ తన కెరీర్ లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసారు. ఇక ఎక్కువ శాతం మల్టీ స్టార్రర్ చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ ఆడియన్స్ కి తన సినిమాలతో బాగా కనెక్ట్ అయ్యాడు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో మంచి హిట్స్ అందుకున్న శ్రీకాంత్ ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా నేను చేయగలనని నిరూపించాడు ‘ఖడ్గం’ సినిమాతో, అందులో పోలీస్ ఆఫీసర్ రాధకృష్ణ గా అందరినీ ఆకట్టుకున్నాడు. మహిళా అభిమానులను సొంతం చేసుకున్న శ్రీకాంత్ కి ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయనతో తన అనుబంధం గురించి శ్రీకాంత్ గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

చిరంజీవి గారిని సినిమా అవకాశం అడిగితే…
చిరంజీవి గారి సినిమాలను చూసి ఆయన అభిమానిగా మారి ఆ ఆసక్తితోనే సినిమాల్లోకి వచ్చిన శ్రీకాంత్ గారు ఇండస్ట్రీకి వచ్చిన తరువాత చిరంజీవి గారితో మంచి అనుబంధాన్ని పెంచుకున్నారు. అన్నయ్య అంటూ చిరంజీవి గారిని పిలిచే శ్రీకాంత్ నిజంగానే సొంత తమ్ముడిలాగ ఆయనకు మారిపోయాడట. అయితే తాను హీరో అయినా తన అభిమాన నటుడితో కలిసి నటించాలనే కోరిక ఉంటుంది. అలానే శ్రీకాంత్ గారికి చిరంజీవి గారితో కలిసి నటించాలనే కోరిక ఉండేది.

ఇక ‘శంకర్ దాదా ఏంబిబిఎస్’ సినిమా తీయబోతున్నారని తెలిసీ చిరంజీవి ఇంటికి వెళ్లి ఎవరు ‘ఏటిఏం’ పాత్ర చేస్తున్నారని శ్రీకాంత్ అడుగగా ఇంకా ఎవరినీ అనుకోలేదు నువ్వు చేస్తావా అని చిరంజీవి అన్నారట. అందుకే కదా ఇంటికి వచ్చింది, నేను చేస్తాను అన్నయ్య అని అడిగాక అలా ఆ పాత్రలో నటించి ఆయన కోరిక తీర్చుకున్నారట శ్రీకాంత్. ఇక ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఒక అక్క నేను తమ్ముడు ముగ్గురం పిల్లలం అంటూ చెప్పారు. శ్రీకాంత్ గారి తమ్ముడు కూడా కొన్ని సినిమాలలో నటించడం విశేషం. ఇక శ్రీకాంత్ గారి అక్క కూతురునే హీరో గోపీచంద్ పెళ్లి చేసుకున్నారు.































