విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో సువర్ణ పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ గొప్ప నటీమణిగా పేరు తెచ్చుకున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఆమె రక్తంలోనే నటన ఉంది. ఐశ్వర్య తండ్రి పేరు రాజేష్ కాగా అతను మల్లెమొగ్గలు, రెండు జెళ్ళ సీత, ఆనంద భైరవి వంటి చిత్రాల్లో నటించి మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నారు. ఐశ్వర్య తాతయ్య అమర్నాథ్ కూడా నటనారంగంలో మంచి పేరు తెచ్చుకున్న నటుడే. అమర్నాథ్ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ మేనత్త శ్రీలక్ష్మి 500 పైచిలుకు తెలుగు, తమిళ కన్నడ సినిమాల్లో హాస్యనటి గా నటించి కడుపుబ్బా నవ్వించారు. జంధ్యాల సినిమాల్లో కూడా ఆమె నటించి చాలా హాస్యాస్పదమైన డైలాగులను తనదైన శైలిలో చెప్పి ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.

అప్పట్లో ఐశ్వర్య తండ్రి రాజేష్ హైదరాబాద్ నగరం నుండి చెన్నై కి మకాం మార్చారు. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఐశ్వర్య రాజేష్ చెన్నైలోనే తన జీవితాన్ని గడుపుతున్నారు. తండ్రి హీరోగా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఐశ్వర్యా రాజేష్ చిన్నతనం నుండే ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేవారు. తన తండ్రి రాజేష్ ఒక్క సినిమాలో నటిస్తే వచ్చిన డబ్బులు అన్నీ కూడా దానధర్మాలకు ఇవ్వాల్సి వచ్చేది. పొద్దస్తమానం ఎవరో ఒకరు వచ్చి రాజేష్ ను దానం చేయమని అడిగేవారట. వచ్చిన వారిని కాదనలేక రాజేష్ ఆర్థిక సహాయం చేసేవారట. ఐశ్వర్య తల్లి కూడా అతి మంచి వ్యక్తి కావడంతో సంపాదించినవి కొన్ని డబ్బులు అయినా సరే వాటిని కూడా దానం చేసేవారట. ఐశ్వర్య తల్లిదండ్రులు ఎంత అతి మంచివారంటే… లక్షల రూపాయలకు షూరిటీ కూడా ఉండి ఇతరులకు డబ్బులు ఇప్పించేవారట. ఇలా ముందు వెనుక ఆలోచించకుండా అందరికీ మంచి చేసి చివరికి కూడబెట్టిన సొమ్మునంతా పోగొట్టుకున్నారు.

అంతేకాకుండా రాజేష్ తాగుడుకు అలవాటుపడి తన ఆరోగ్య మొత్తం సర్వనాశనం చేసుకున్నారు. దాంతో ఐశ్వర్య తో పాటు తన ముగ్గురు అన్నయ్యలను కూడా పోషించడానికి రాజేష్ భార్య ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేసేవారు. ఆర్థిక భారంతో మానసికంగా, శారీరకంగా బాగా కృశించిపోయినప్పటికీ తన భర్తని బతికించుకోవడం కోసం ఖరీదైన వైద్యం చేయించారు. కానీ రాజేష్ లివర్ పూర్తిగా చెడిపోవడంతో అతను చనిపోయారు. అప్పటికి ఐశ్వర్య రాజేశ్ వయసు కేవలం 8 సంవత్సరాలే. అయితే అప్పటికి వాళ్లకి ఒక ప్లాట్ ఉండేది కానీ షూరిటీ తీసుకున్న వారంతా మొహం చాటేయడంతో అప్పులు ఇచ్చినవారు ఐశ్వర్య రాజేష్ కుటుంబానికి ఉన్న ఒక్కగానొక్క ప్లాట్ ని కూడా ఆక్రమించుకున్నారు. దాంతో చివరికి అద్దె ఇంట్లో ఉంటూ తల దాచుకోవడం ప్రారంభించారు.

ఒక రోజు తిని ఒకరోజు తినక ఎంతో కాయకష్టం చేసిన రాజేష్ భార్య తన పిల్లలను పెంచి పెద్ద చేసి మంచి చదువులు చదివించారు. కానీ దురదృష్టవశాత్తు చేతికి అందివచ్చిన ఇద్దరు పెద్ద కుమారులు చనిపోయారు. ఆ దుర్ఘటన తో ఐశ్వర్య రాజేష్ కుటుంబం మళ్లీ దయనీయమైన పరిస్థితికి వచ్చింది. ఇద్దరు కుమారులు చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఐశ్వర్య రాజేష్ తల్లి చాలా రోజుల వరకు మంచానికి పరిమితమయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ ఐశ్వర్య పైనే పడగా ఆమె సీరియళ్లలో నటించడానికి సిద్ధపడ్డారు. సీరియళ్లలో పొద్దున ఆరింటికి నుండి రాత్రి 11 గంటల వరకు నటించినందుకుగాను ఆమెకు రూ. 500 మాత్రమే ఇచ్చేవారట. కానీ పూట గడవడానికి ఏ దిక్కు లేక సీరియల్లోనే నటించేవారట. ఆ క్రమంలోనే సినిమాల్లో నటిస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని తెలుసుకున్న ఐశ్వర్య మూవీ ఆఫర్స్ కోసం ప్రయత్నించారు కానీ ప్రతి ఒక్కరూ ఆమెను దారుణంగా అవమానించారు. కలరు బాగోలేదని, భాష బాగోలేదని మొహం మీదే నోటికొచ్చినట్టు తిట్టేవారట. కానీ ఆ అవమానాలను తాను లెక్కచేయకుండా మొండి పట్టుదలతో ముందడుగు వేసి ప్రస్తుతం హీరోయిన్ స్థాయికి ఎదిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here