సాధారణంగా చిన్న పిల్లలు దెయ్యం పేరు చెప్పినా దెయ్యాల కథలు విన్నా భయపడుతూ ఉంటారు. చిన్న పిల్లలు తినకపోతే బూచోడికి పట్టిస్తామంటూ బెదిరిస్తూ కూడా ఉంటారు. అలా దెయ్యం, బూచోడి పేర్లను వాడుకుని తల్లిదండ్రులు పిల్లలు తినేలా, బుద్ధిగా ఉండేలా చేస్తారు. అయితే ఈ బుడతడికి మాత్రం అస్థిపంజరం అంటే ఇష్టం. అది పక్కన ఉంటే మాత్రమే ఈ బుడ్డోడు ఆటలు ఆడటం, తిండి తినడం చేస్తాడు.

అస్థి పంజరం పక్కన లేకపోతే ఈ బుడ్డోడికి ఒక్క నిమిషం కూడా గడవదు. అందరు పిల్లలకు భిన్నంగా అస్థి పంజరంతో దోస్తానా చేస్తూ ఈ బుడ్డోడు వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఈ బుడ్డోడు అస్థిపంజరంతో స్నేహం చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంట్లో ఉన్నాడంటే పగలూ రాత్రి తేడాల్లేకుండా ఈ బుడ్డోడికి అస్థిపంజరం పక్కన ఉండాల్సిందే. అయితే ఈ బాలుడు మన దేశానికి చెందిన బాలుడు కాదు.
అమెరికాకు చెందిన ఈ చిన్నారి పేరు థియో. రెండేళ్ల థియోకు అస్థి పంజరం అంటే మహా ఇష్టం. థియో ఆ అస్థి పంజరమే తన బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతుంటాడు. బొమ్మ అస్థిపంజరం తనకు ఎంతో నచ్చడంతో తనతో పాటు అది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. ఆ అస్థిపంజరానికి బెన్ని అనే ముద్దుపేరు కూడా పెట్టడం గమనార్హం. కారణం ఏంటో తెలియదు కానీ థియోకు అస్థి పంజరం తెగ నచ్చేసింది.
కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఒక మూలన ఉన్న అస్థి పంజరం బొమ్మ నచ్చడంతో దానిని తనతోనే ఉంచుకున్న థియో తల్లిదండ్రులతో షాపింగ్ కు వెళ్లినప్పుడు బొమ్మ అస్థిపంజరాన్ని కొనిపించుకున్నాడు. రెండు అస్థి పంజరాలతో థియో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































