అమరావతి: ఆర్కే రోజా వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. సభ్యత, సంస్కారాలు లేకుండా మాట్లాడే వ్యక్తులపై స్పందించాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. అయితే కొంతమంది నేతలు తాము ఎదుర్కొంటున్న రాజకీయ ప్రస్టేషన్‌ను తట్టుకోలేక అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. అలాంటి మాటల వల్ల ప్రజల సానుభూతి పొందవచ్చని కొందరు అనుకుంటున్నప్పటికీ, నిజంగా ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారని అనిత తెలిపారు.

పెద్దిరెడ్డి గన్‌మెన్ సస్పెన్షన్ పై స్పందన
ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్‌మెన్ సస్పెన్షన్ అంశాన్ని ప్రస్తావిస్తూ, మంత్రి అనిత స్పందించారు. గన్‌మెన్ అనే వారు వ్యక్తిగత భద్రత కోసం నియమిస్తారని, అలాంటి వారిని అటెండర్‌లా వాడటం పూర్తిగా తప్పని ఆమె ఎత్తి చూపారు. రేపు ఎవరు పెద్దిరెడ్డిపై దాడికి పాల్పడినా, అటువంటి పరిస్థితుల్లో గన్‌మెన్ ఎలా రక్షిస్తారని ఆమె ప్రశ్నించారు.
ఉద్యోగులకు స్వేచ్ఛ, రాష్ట్ర ప్రయోజనాలు
తాజాగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం యంత్రాంగంలో ఉద్యోగులు ఎవరికీ తోత్తులుగా మారాల్సిన అవసరం లేదని, వారు నిజాయితీగా పని చేయడానికి స్వేచ్ఛ ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంపై దుష్టశక్తుల కన్ను పడకుండా ఉండాలని దేవుడిని కోరుకున్నానని కూడా ఆమె తన మాటల్లో పేర్కొన్నారు.































