వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నాటికి షర్మిల పాదయాత్ర 34వ రోజుకు చేరుకుంది. ఆమె పాదయాత్ర సమయంలో ఒక ఇబ్బందికర ఘటన చోటుచేసుకుంది. షర్మిల పాదయాత్ర చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగల గుంపు ఆమె టీం పై దాడి చేసాయి. ఈ ఘటన యాదాద్రి జిల్లాలోని మోటకొండూరు మండలం నుంచి పాదయాత్రగా ఆత్మకూరు వెళ్తుండగా చోటుచేసుకుంది.

ఒక చెట్టుకింద గ్రామవాసులతో మాట్లాడుతున్నా సమయంలో తేనెటీగల గుంపు అకస్మాత్తుగా షర్మిలపై దాడి చేసాయి. ఈ క్రమంలో షర్మిల సెక్యూరిటీ సిబ్బంది ఆమె చుట్టూ నిల్చొని కండువాలతో తేనెటీగలను కొడుతూ అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళారు. ఈ దాడి నుండి షర్మిల క్షేమంగా బయటపడ్డారు. కానీ పార్టీ కార్యకర్తలు, ఆమె సిబ్బందిలో కొందరికి గాయాలయ్యాయి. కాస్త విరామం తీసుకుని తిరిగి మళ్ళీ పాదయాత్రను ప్రారంభించారు షర్మిల. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.





























