దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదయినట్టు తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. బొల్లారం ప్రాంతానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్ అనే టెక్నీషియన్ 2012 నుంచి 2016 వరకు దాసరి వద్ద మూవీ రిస్టోరేషన్ ఔట్‌సోర్సింగ్ పనులు చేసేవారట. అయితే ఆ సమయంలో దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్ ఇద్దరికీ అతను బాగా పరిచయం. ఇక నవంబర్ 15, 2018 న దాసరి నారాయణరావు మరణించిన తరువాత ఇదివరకు చేసుకున్న పాత ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా మరో ఒప్పందం కుదుర్చుకున్నారు.

అయితే ఇటీవల డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన సమయంలో దాసరి అరుణ్ డబ్బులు ఇవ్వనని అసలు తాను ఆ ఒప్పందంపై సంతకం చేయలేదని చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 13న రాత్రి తన డబ్బుల గురించి అడిగినప్పుడు ఫిలింనగర్ లోని ఎఫ్‌ఎన్‌సీసీ కి రమ్మని అరుణ్ కుమార్ చెప్పగా.. చక్రపాణి అనే ప్రత్యక్ష సాక్షిని తీసుకొని వెళ్లానని బాధితుడు చెప్పాడు.

తన డబ్బులు అడిగేందుకు వెళ్ళిన అతనిని దాసరి అరుణ్‌కుమార్ దూషిస్తూ.. కులం పేరుతో తనను తిట్టారని, నీ అంతు చూస్తానంటూ బెదిరించారని అయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో దాసరి అరుణ్ కుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
































