తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి తన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నారు. సభకు వచ్చేటప్పుడు మీడియాతో మాట్లాడిన ఆయన, సోషల్ మీడియాలో తనకున్న ప్రాచుర్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తానే పెద్దగా ట్రెండ్ అవుతున్నానని, సోషల్ మీడియాను ముందుకు నడిపేది కూడా తనలాంటి వారేనని నవ్వుతూ అన్నారు.

సినిమాల్లో నటించే అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు కూడా మల్లారెడ్డి తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. ఎవరో అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని, తానే ఇప్పటికే పెద్ద స్టార్‌నని వ్యాఖ్యానించారు. అవసరమైతే తన సినిమాను తానే నిర్మించుకునే సామర్థ్యం తనకు ఉందని తెలిపారు.
ఇలా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. సభలోనూ, బయటా కూడా తనదైన పంచ్ డైలాగులతో చర్చనీయాంశంగా మారడం మల్లారెడ్డికి కొత్తేమీ కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.



























