పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి ఎన్నో విధాలుగా బయటపడుతుంటుంది. కొందరు చివరి నిమిషం వరకు చదువుతో పోరాడుతుంటే, మరికొందరు మాత్రం జవాబులు రాకపోతే ఎగ్జామినర్‌ను వేడుకునే దారిని ఎంచుకుంటారు. తాజాగా తెలంగాణలో అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల ఇంటర్ పరీక్షలు పూర్తవడంతో ప్రస్తుతం సమాధాన పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ విద్యార్థి రాసిన ఆన్సర్ షీట్‌ను చూసి ఎగ్జామినర్ కూడా ఆశ్చర్యపోయినట్టు సమాచారం. ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన చోట, ఆ విద్యార్థి మాత్రం తనను పాస్ చేయాలంటూ భావోద్వేగపూరితంగా విజ్ఞప్తి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆన్సర్ షీట్‌లో “సార్… మీ కాళ్లు మొక్కుతా, దయచేసి పాస్ చేయండి” అంటూ విద్యార్థి రాసిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. అంతేకాకుండా ఒక గురువు కాళ్లపై శిష్యుడు నమస్కరిస్తున్నట్లుగా బొమ్మ గీయడం, దానిలో “సార్” మరియు “నేను” అని గుర్తులు పెట్టడం అతని వినూత్నతను చూపిస్తోంది. చదువు రాకపోయినా, తన పరిస్థితిని చెప్పేందుకు అతను చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక తన కుటుంబ పరిస్థితిని కూడా ఆ విద్యార్థి వివరించాడు. తనకు తల్లిదండ్రులు లేరని, గురువులే తనకు అన్నీ అన్న భావోద్వేగంతో రాసిన మాటలు చదివినవారిని కదిలిస్తున్నాయి. “దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను… ఆ దేవుడు కూడా మీరే సార్” అంటూ ఎగ్జామినర్‌ను ప్రసన్నం చేసుకునేలా ప్రయత్నించాడు.
పరీక్షలో తాను చదివిన ప్రశ్నలు రాలేదని, ఎంత ప్రయత్నించినా రాయలేకపోయానని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ ఒక్కసారి పాస్ చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటానని కూడా అభ్యర్థించాడు. అతని ఈ వేడుకోలు కొందరిని నవ్విస్తుంటే, మరికొందరిని ఆలోచింపజేస్తోంది.
ఇలాంటి సంఘటనలు కొత్తవి కాకపోయినా, ఈ విద్యార్థి చూపించిన సృజనాత్మకత, భావోద్వేగ వ్యక్తీకరణ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. పరీక్షల్లో మార్కులు మాత్రమే కాకుండా, విద్యార్థుల మానసిక స్థితి, ఒత్తిడి వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.



























