టాలీవుడ్ లో ఇలియానా నెంబర్ వన్ స్ధానంలో వుంటూ అగ్ర కథానాయికగా రాణించిన సంగతి అందరికీ తెలిసిందే.! తాను నటించిన సినిమాలకు భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకున్నట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. అందాలను ఆరబోసే పాత్రలలో నటిస్తూ.. గ్లామర్ డాల్ గా ఓ విశిష్ట గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కొన్ని సినిమాలు చేసినా ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సడెన్ గా ఇలియానా కెరీర్ చతికిలపడింది. ఇక తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోయి రెంటికీ చెడ్డ రేవడి అయినట్టు అయింది ఇలియానా పరిస్థితి.

ఇక ప్రస్తుత విషయానికొస్తే.. ఇలియానాకు ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఓ బెస్ట్ ఆఫర్ వచ్చినట్టుగా తాజా సమాచారం. అది కూడా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సరసన నటించే ఛాన్స్ కావడం విశేషం. భారీ అంచనాలతో వచ్చిన ‘మన్మధుడు -2’ సినిమా ఘోర పరాజయం పొందడంతో నాగార్జున ఇప్పుడు తన స్టైల్ ను మార్చాడు. ఇప్పడొక డిఫరెంట్ జోనర్ లో ఓ టాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. నాగార్జున తాజాగా చేస్తున్న ఆ సినిమా పేరు ‘వైల్డ్ డాగ్’. ఈ సినిమా తర్వాత నాగార్జున ‘గరుడ వేగ’ ఫేం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి.

అయితే ఈ సినిమా డైరెక్ట్ తెలుగు మూవీ కాదని.. బాలీవుడ్ మూవీ ‘రైడ్’ కు రీమేక్ గా తెరకెక్కబోతుందని సమాచారం. ‘రైడ్’ లో అజయ్ దేవగన్, ఇలియానా జంటగా నటించారు. ఇక తెలుగులో కూడా ఇలియానాను తీసుకొనేందుకు ప్లాన్ చేస్తున్నారట. So.. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ఇలియానాకు మంచి ఆఫరే వచ్చిందన్నమాట.!



























