సినిమారంగంలో విచిత్రమైన పరిస్థితి.. దర్శకులైదామని వచ్చిన వాళ్ళు హీరోలయ్యారు. హీరో అవుదామని వచ్చిన వాళ్లు దర్శకులయ్యారు. అలాగే హీరోయిన్ అవుదామని వచ్చిన వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. కానీ ఎవరు ఒక వ్యాంప్ గా స్థిరపడి పోదామని వచ్చిన వారు ఎవరూ ఉండరు. జ్యోతిలక్ష్మి, జయమాలిని, విజయలలిత, జయలలిత, సిల్క్ స్మిత, డిస్కోశాంతి, అనురాధ ఇలా ఎవరైనా తాము ఐటమ్ సాంగ్ కే పరిమితం అవుదామని వచ్చిన వాళ్లు కాదు. ఇలాంటి కోవలోకి ఆనాటి జయలలిత వస్తారు.

ఆంధ్ర నాట్యం నేర్చుకుందామని హైదరాబాద్ వచ్చిన జయలలితను, ఒకే ఒక్క సినిమాలో నటించమని.. తనతండ్రి అనడంతో ఆమె సినిమా అవకాశాల కోసం మద్రాసు వచ్చారు. చిరంజీవితో నటించే అవకాశం జయలలితకు త్రుటిలో తప్పిపోయింది. అలా అనుకోని కారణాల వలన కేరళ వెళ్లాల్సి వచ్చింది. మొదటగా జయలలితకు బిగ్రేడ్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. హీరోయిన్ గా తెలుగులో అవకాశం పోయింది, అలాగే బి గ్రేడ్ చిత్రాలను వదిలిపెడితే తనకు భవిష్యత్తు ఉండదని, పైగా కుటుంబ భారం ఆమె మీద పడడంతో చేసేదిలేక జయలలిత ఆ చిత్రాల్లో నటించాల్సి వచ్చింది. మలయాళ చిత్రాలను చూసిన తెలుగు దర్శక, నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్ కి తీసుకోవడం జరిగింది.

ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ఒక సందర్భంలో జయలలితకు ఒక హీరోయిన్స్ కు ఉండే లక్షణాలన్నీ ఉన్నాయని.. ఆమెను హీరోయిన్ ని చేయండని జయలలిత తండ్రితో చెప్పారు. మీ చిత్రాల్లోనే నన్ను హీరోయిన్ గా తీసుకోవచ్చుగా అని డి.రామానాయుడును అడిగింది. కానీ ప్రతి దర్శక, నిర్మాతలు ఆమె లో ఉన్న వ్యాంప్ ని చూశారే తప్ప.. ఆమెకు ఒక హీరోయిన్ గా అవకాశం ఇద్దామని ఎవరు ముందుకు రాలేదు. ఆ క్రమంలో జయలలిత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో వ్యాంప్ గా స్థిరపడ్డారు.

అలా ‘ఇంద్రుడుచంద్రుడు ‘చిత్రంలో కమల్ హాసన్ ప్రక్కన వ్యాంప్ క్యారెక్టర్ లో నటించారు. చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో రావు గోపాలరావు ప్రక్కన వ్యాంపుగా నటించింది. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన ‘రౌడీ గారి పెళ్ళాం’ చిత్రంలో ‘యమా రంజు మీద ఉంది పుంజు..” అనే పాటలో తన అందాలను ఆరబోసింది.

ఇకపోతే ఈ మధ్యకాలంలో మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ గా ఒక ఉన్నతమైన పాత్రలో జయలలిత నటించారు. మిగతా దర్శకులు నన్ను ఒక వ్యాంప్ గా గుర్తిస్తే… కొరటాల శివ మాత్రం నాలో ఒక తల్లిని చూశారని భరత్ అనే నేను సినిమా సక్సెస్ మీట్ లో ఆమె చెప్పుకొచ్చారు.



























