గోదావరి జిల్లాలో నాటకాలు వేస్తూ చదువును పక్కన పెట్టిన తన కొడుకుని.. మన వంశంలో డిగ్రీ వరకు చదివిన వారు లేరు. కనీసం నువ్వు డిగ్రీ చదివి నీకు ఇష్టమైన రంగంలో కి వెళ్ళు అని తండ్రి చెప్పడంతో.. ఇక అప్పటి నుండి కోడి రామకృష్ణ నాటకాలు వేయడం పక్కన పెట్టారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత దాసరి దర్శకత్వంలో ‘తాతా మనవడు’ చిత్రం విడుదల అయ్యింది. విజయవంతంగా ఆ సినిమా ప్రదర్శించబడటంతో ఎలాగైనా దాసరి నారాయణరావు దగ్గర దర్శకత్వ శాఖలో పని చేయాలని కోడిరామకృష్ణ నిర్ణయించుకున్నారు.

ఆ సినిమా అర్ద శతదినోత్సవ వేడుక పాలకొల్లు లోని ఒక థియేటర్ లో జరుగుతుండగా కోడి రామకృష్ణ వెళ్లి దాసరి గారిని.. మీ దగ్గర నేను దర్శకత్వ శాఖలో పని చేస్తానని చెప్పారు. అలా దాసరి మద్రాస్ వెళ్లి కబురు చేయడంతో కోడి రామకృష్ణ మద్రాస్ వెళ్లడం జరిగింది. దాసరిని దర్శకుడిగా పరిచయం చేసిన రాఘవతో పరిచయం పెంచుకోవడంతో.. ఆయన నిర్మిస్తున్న ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కోడి రామకృష్ణకు ఇవ్వడం జరిగింది. అలా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో ప్రారంభమైన ఆయన సినీ జీవితం.. తరంగిణి, ఆలయ శిఖరం, ముక్కుపుడక, మంగమ్మగారి మనవడు, గూడచారి నెంబర్ వన్, ముద్దులమామయ్య, 20వ శతాబ్దం, అంకుశం, అమ్మోరు, అరుంధతి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కోడి రామకృష్ణ.. బాలకృష్ణ, చిరంజీవిలతో ఎక్కువ సినిమాలు రూపొందించారు. ఈయన కుటుంబపరమైన కథలతో కూడిన సినిమాలను ఎక్కువగా రూపొందించారు. 1989లో రాజశేఖర్ జీవిత హీరోహీరోయిన్లుగా రాజకీయ నేపథ్యం గల కథతో అంకుశం చిత్రాన్ని రూపొందించారు. ఇది యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ఇమేజ్ కి ఎంతగానో దోహదపడింది. ఆ తర్వాత మరో రాజకీయ నేపథ్యంలో కథతో ఓ సినిమా రూపొందించాలనుకున్నారు. కోడి రామకృష్ణ తాను ఎంచుకున్న పొలిటికల్ స్టోరీ.. చిత్రరూపం దాల్చడానికి కొన్ని అవాంతరాలు ఉంటాయని ఆ క్రమంలో నిర్మాతకు తనకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆ ఉద్దేశంతో.. ఆయనే సొంతంగా భారత్ బంద్ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు.

ఆ క్రమంలో వినోద్ కుమార్, రెహమాన్, అర్చన హీరోహీరోయిన్లుగా.. కాస్ట్యూమ్స్ కృష్ణ విలన్ గా ‘భారత్ బంద్’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం.. అవుట్ డోర్ లో జరిగింది. పబ్లిక్ ప్లేస్ లో షూటింగ్ జరపడం అంటే ప్రభుత్వ అనుమతులు ఇతరాత్ర ఉంటాయి. ఈ సినిమాలోని ఓ సీన్ డిమాండ్ చేయడంతో.. కర్ఫ్యూలో అర్ధరాత్రి చార్మినార్ వద్ద షూటింగ్ చేశారు. ఇలా పబ్లిక్ స్థలాల్లో ప్రభుత్వ అనుమతులు తీసుకుంటూ మిగతా సినిమా సన్నివేశాలను దర్శకుడు కోడి రామకృష్ణ చిత్రీకరించారు. నిజంగా కోడి రామకృష్ణ గట్స్ కి సెల్యూట్ కొట్టాలిసిందే.. 1991లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.
































