Narashimha Raju : ఆ రోజుల్లో పౌరాణిక చిత్రాల తర్వాత జానపద చిత్రాలకు అత్యంత ప్రాధాన్యత ఉండేది. జానపద చిత్రాలు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు కాంతారావు. ఆయన తర్వాత జానపద చిత్రాల్లో నరసింహరాజు కథానాయకుడిగా కనిపించారు. హీరో అయిపోదామని మద్రాస్ వచ్చిన నరసింహరాజు బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో ‘నీడలేని ఆడది’ చిత్రంలో మొదటి సారిగా నటించారు.

ఆ తర్వాత అమ్మాయిలు జాగ్రత్త, మొగుడా పెళ్లామా, తూర్పు పడమర లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఇవన్నీ ఒకే సంవత్సరంలో నటించిన చిత్రాలు కావు… ఆయనకు సంవత్సరంలో ఒకే చిత్రంలో నటించే అవకాశం వచ్చేది. నరసింహరాజు సినీ పరిశ్రమకు వచ్చే ముందు యేడాదే పెళ్లి చేసుకున్నారు. అలా ఏడాదికి ఒక సినిమా చేయడం నరసింహరాజుకి చాలా కష్టంగా ఉండేది. పిల్లలతో కుటుంబాన్ని నడపాలి అంటే సంపాదన కూడా అంతే ఉండాలి. అడపాదడపా సినిమా అవకాశాలు రావడం వలన కుటుంబాన్ని గడపడం చాలా కష్టంగా ఉండేది.

ఆ క్రమంలో ఆయన వేషాల కోసం జానపద బ్రహ్మ విఠలాచార్య ను కలవడానికి వెళ్లారు. అప్పుడు జగన్మోహిని చిత్రం కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో జయమాలిని లీడ్ రోల్ పోషించగా, కథానాయకుడి కోసం ఒకరిద్దరి పేర్లను విఠలాచార్య పరిశీలిస్తున్నారు. ఆ జాబితాలో నరసింహరాజు పేరు కూడా ఉండడం ఓ విశేషం. వెతకబోయిన తీగ కాలుకు తగిలినట్టుగా.. జగన్మోహిని చిత్రానికి ముందుగానే కథానాయకుడిగా అనుకున్న నరసింహరాజు విటలాచార్యను కలిశారు.

జయమాలిని అంతకుముందే కొన్ని ఐటమ్ సాంగ్స్ లో నటించారు. జయమాలిని ఒక విధంగా చెప్పాలంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో ఈ సినిమాలోనే కనిపించారు. జయమాలిని అంటే అప్పటికి ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉండేది. క్లబ్ డాన్స్ లో కనబడితే ఉర్రూతలూగే ప్రేక్షకులు ఏకంగా జగన్మోహిని చిత్రంలో ఫుల్లెంత్ క్యారెక్టర్లో కనిపించేసరికి ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. అప్పట్లో హీరోయిన్ ను తలదన్నే అందం జయమాలిని సొంతం. ఆమెతో షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమె అందానికి ఫిదా కానీ హీరో ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

జయమాలిని సాధారణంగా షూటింగ్ కి హాజరైనప్పుడు కేవలం డాన్స్ పైనే తన మనసును కేంద్రీకరించేవారు. తోటి నటీనటులతో సంభాషించడం, కలుపుగోలుగా ఉండటం లాంటివి జయమాలిని చేసేవారు కాదు. అయితే జయమాలినితో షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఆమె అందానికి మీరు ఫిదా అయ్యారని నరసింహ రాజును అడిగినప్పుడు… తను సినిమాల్లోకి వచ్చే ముందే పెళ్లి చేసుకున్నానని.. షూటింగ్లో జయమాలిని తన పని తాను చేసుకునేదని ఏ నటుడిని కూడా కన్నెత్తి చూసేది కాదని, ఎక్కువగా తన తల్లితో షూటింగ్ లకు తరచూ హాజరవుతుండేదని, ఆమెపై తనెప్పుడూ మనసును పారేసుకోలేదని నరసింహరాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

































