సత్యమూర్తి కథ చెప్పిన తర్వాత డి.రామానాయుడుకు ఒక సందేహం కలిగిందట. అడవిరాముడు, వేటగాడు, జస్టిస్ చౌదరి లాంటి మాస్ చిత్రాలను చేసిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇలాంటి ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని నడిపించగలరాని డి.రామానాయుడు అన్నప్పుడు కె.రాఘవేంద్రరావు కథపై ఉన్న నమ్మకాన్ని చూసి చివరికి దేవత చిత్రానికి దర్శకుడిగా రాఘవేంద్రరావును ఎన్నుకున్నారు.

తెరపై శోభన్ బాబు ప్రేమానుబంధాలు పండించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇద్దరు కథానాయికులతో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. అనగానే అభిమానుల్లో ఒకటే కోలాహలం. రాజా, రాధాకృష్ణ, మోసగాడు చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు శోభన్ బాబు కలయికలో వచ్చిన చిత్రం దేవత. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన 33వ చిత్రం ఇది. కానీ సురేష్ ప్రొడక్షన్స్ లో మొదటి చిత్రం కావడం విశేషం. అసలు రాఘవేంద్రరావు మొదటి చిత్రమే సురేష్ ప్రొడక్షన్స్ లో రూపొందాలి. కానీ అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు.

తర్వాత రెండు, మూడు సార్లు అవకాశం వచ్చినా రాఘవేంద్రరావు ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో వాయిదా పడుతూ వస్తోంది. చివరికి రాఘవేంద్రరావు 33వ చిత్రంగా సురేష్ ప్రొడక్షన్స్ లో దేవత చిత్రం రూపొందింది. అయితే ఈ చిత్రంలో ఆర్ద)తో కూడిన సన్నివేశాలు, రక్తి కట్టించే భావోద్వేగాలు ప్రేక్షకుల దృష్టిని మరల్చకుండా చేస్తాయి. ముక్కోణపు ప్రేమకథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ దుందుభి మోగించింది. జయప్రద శ్రీదేవి ఈ సినిమాలో కలిసి నటించినప్పటికీ.. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది… సినిమా షూటింగ్లో ఇద్దరిపై సన్నివేశాలను చిత్రీకరించడానికి రాఘవేంద్రరావు నానా ఇబ్బందులు పడేవారు. వారిని ఒప్పించి దర్శకుడు ఈ సినిమాని పూర్తి చేశారు.

ఇక సినిమాలో సంగీతం ప్రధాన పాత్ర పోషించిందని చెప్పవచ్చు. వెల్లువచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో… అనే పాట ఆ రోజుల్లో ఆంధ్ర దేశమంతటా ఓ ఊపు ఊపింది. ఆసక్తికర విషయమేమంటే.. ఈ పాట షూటింగ్ గోదావరి జిల్లాలో జరుగుతుండగా.. రాఘవేంద్రరావు తనదైన మార్కును ప్రతి సినిమాలో చూపిస్తాడు. అలా ఈ పాట కోసం చెన్నై నుంచి బిందెలను తెప్పించారు. వాటిని క్రమపద్ధతిలో ఒకదానిపై ఒకటి అలంకరించారు.

గోదారి ఒడ్డుపై పాట షూటింగ్.. అక్కడికి వెళ్లాలంటే గోదావరి నీళ్లు దాటాలి. శ్రీదేవి తను వేసుకున్న లంగా ఓణి తడిసిపోయి షూటింగ్ కి ఇబ్బంది కలుగుతుందని నిర్మాత డి.రామానాయుడు భావించి శ్రీదేవి ని ఎత్తుకొని షూటింగ్ స్పాట్ వరకు వెళ్లడంతో.. వారిద్ధరిని అక్కడ చూసిన యూనిట్ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రీదేవి రావడంతో రాఘవేంద్రరావు పాట షూటింగ్ ప్రారంభించారు.































