టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ స్టైల్ ఇంకెవరీకీ రాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకత్వ శాఖలో పనిచేసిన రవితేజ నీకోసం సినిమాతో హీరోగా మారాడు. స్వయం కృషితో ఎదిగి ఈ రోజు తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ని సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఇన్స్పైరింగ్ హీరో అంటే రవితేజనే చెప్పాలి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగొచ్చు..ఏలొచ్చు అని చిరంజీవి తర్వాత నిరూపించిన హీరో.

ఇక ఆయన సినిమాలు మాస్ ఆడియన్స్ కి మాంచి కిక్ ఇస్తుంటాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి రవితేజ సినిమాలు బాగా నచ్చుతుంటాయి. ఎంత మాస్ సినిమా చేసిన అందులో కథా బలం, ఫ్యామిలీ ఎమోషన్స్ తప్పకుండా ఉండేలాగే మాస్ మహారాజ కథలను ఎంచుకుంటున్నాడు. రవితేజ మాదిరిగా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన టాలీవుడ్ హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ ఆయన రేంజ్ కి రీచ్ అవలేక మధ్యలోనే ఆగిపోయారు. కానీ ఇన్నాళ్ళకి రవితేజ ఆటిట్యూడ్ కి కాస్త అటు ఇటూగా, పూరి జగన్నాథ్ టైటిల్స్ కి తగ్గ మ్యానరిజంతో ఓ యంగ్ హీరో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

ఆ హీరోనే కిరణ్ అబ్బవరం. ఈ హీరో నటించిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవంగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వేవ్స్ వల్ల ఆగిపోయింది. అయితే సాంగ్స్ పరంగా బాగా పబ్లిసిటీ వచ్చింది. సినిమా రిలీజ్ కి ముందే టీవీలో, యూట్యూబ్ లో రెండు పాటలకి బాగా ప్రేక్షకాధరణ లభించింది. ఆ సాంగ్స్‌లో కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ చూసిన కొంతమంది రవితేజతో కంపేర్ చేశారు. హీరోయిన్‌తో ఉన్న సీన్స్ చాలా వరకు రవితేజ ఎలా చేస్తాడో అలా చేయడానికే ట్రై చేశాడు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం అన్నీ వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

హీరోగా మంచి హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా రిలీజ్ తర్వాత పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు ఎస్ ఆర్ కళ్యాణ మండపం రిలీజ్ కి ముందు మూడు సినిమాలు కమిటైన ఈ మాస్ హీరో ఎస్ ఆర్ కళ్యాణ మండపం రిలీజ్ తర్వాత మరో మూడు సినిమాలను ఒప్పుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలలో సత్య దేవ్ తర్వాత ఆ రేంజ్ దూకుడుగా సినిమాలు చేస్తుంది అంటే కిరణ్ అబ్బవరం, సంతోష్ శోభన్. టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ ముగ్గురు వరుస ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు.

ముఖ్యంగా కిరణ్ అబ్బవరం ఇప్పుడు కమిటయిన సినిమాలన్ని మాస్ కథలే. రవితేజ నటించిన ఇడియట్, అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు, మహేష్ బాబు నటించిన పోకిరి లాంటి సినిమాలు చేయాలని ఈ హీరో ప్లాన్ చేసుకుంటున్నాడు. మొదటి సినిమా సక్సెస్ తో వరుసగా ప్రాజెక్ట్స్ అయితే కమిటయ్యాడు. కానీ ఆ ప్రాజెక్ట్స్ లో కనీసం ఓ మూడు నాలుగు సినిమాలైనా భారీ హిట్ సాధిస్తే ఖచ్చితంగా టాలీవుడ్‌లో మరో మాస్ హిరోగా క్రేజ్ సంపాదించుకోవడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి కిరణ్ అబ్బవరం ఎంతకాలం హీరోగా నిలబడతాడో.
































