సినిమా ఇండస్ట్రీలో రావు గోపాల రావుకి ఎంతటి గొప్ప పేరుందో అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచి ఎంచుకునే ప్రతీ పాత్ర కోసం ఎంతగానో శ్రమించి ఆ పాత్ర ప్రేక్షకుల మెప్పు పొందేందుకు తన సత్తా చూపేవారు. హీరోయిన్, హీరోలకి తండ్రిగా, మామగారిగా హుందాతనమైన పాత్రలు చేస్తూనే విలనిజాన్ని చూపించారు. రావు గోపాల రావు పోషించిన విలన్ పాత్రలు ఆయనకి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ఎక్కువ సినిమాలు చేసిన రావు గోపాల రావు తన పాత్రలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక విలన్‌గానూ కామెడీ పండించింది అంటే ఎక్కువగా అల్లు రామలింగయ్య కాంబినేషన్‌లోనే.

ఇప్పుడు రావు గోపాల రావు తనయుడు రావు రమేశ్ తండ్రి కంటే విభిన్నమైన పాత్రలు పోషిస్తూ బాగా ఆకట్టుకుంటున్నారు. చెప్పాలంటే కొన్ని పాత్రలు రావు రమేశ్ మాత్రమే చేయగలడు.. ఆయనతోనే చేయించాలని మేకర్స్ గట్టిగా డిసైడవుతున్నారు. ఎలాంటి పాత్రనైనా రావు రమేశ్ ఒక కొత్త రూపురేఖలను తీసుకు వస్తున్నారు. ఎలాంటి ప్రాంతీయ భాషలో డైలాగులు చెప్పాలంటే దానికి తగ్గట్టు తనని తాను ప్రిపేర్ చేసుకుంటున్నారు. క్లాసీ ఫాదర్ రోల్, మాస్ విలన్, చదువు రాని మొరటు వేషం.. ఇలా ఏదైనా అందులో రావు రమేశ్ కనిపించడు. మజిలీ లాంటి సామాన్య తండ్రిగా అయినా, అత్తారింటికి దారేది లాంటి క్లాస్ రోల్ అయినా, ఖలేజా సినిమాలో పోషించినటు వంటి పాత్రనైనా అలవోకగా చేస్తున్నారు.

అందుకే ప్రస్తుతం రావు రమేశ్‌కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది. మొదటి సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన సీమ సింహం. ఇందులో కొన్ని క్షణాలు మాత్రమే కనిపించారు. అది కూడా ఒక్క డైలాగ్ లేకుండా. ఆ తర్వాత ఒక్కడున్నాడు సినిమాలో కూడా కొన్ని క్షణాలు కనిపించే పాత్రలోనే నటించాడు. అయితే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గమ్యం సినిమాలో నటించిన నక్సలైట్ పాత్ర చేశారో అప్పుడు అందరి దృష్ఠిలో పడ్డారు. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చారు. కొత్త బంగారు లోకం సినిమాలో చేసిన ప్రొఫెసర్ పాత్ర బాగా పేరు తీసుకు వచ్చింది.

ఈ సినిమా తర్వాత ఇక రావు రమేశ్ కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కిక్, మర్యాద రామన్న బద్రీనాథ్, గబ్బర్ సింగ్, జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇద్దరమ్మాయిలతో, బలుపు, అత్తారింటికి దారేది.. ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నారు. దువ్వాడ జగన్నాథం సినిమాలో పోషించిన పాత్ర, అజ్ఞాతవాసి తనకి మరింత గుర్తింపు తెచ్చాయి. చెప్పాలంటే ప్రకాశ్ రాజ్ తర్వాత మళ్లీ అన్ని రకాల వెరైటీ రోల్స్ చేస్తున్న నటుడు రావు రమేశ్. ఇప్పుడు ఆయన అందుకునే రెమ్యునరేషన్ కూడా బాగానే ఉందట. ఇలాంటి వాళ్ళు రాబట్టే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరభాషా నటులు రావడం బాగా తగ్గిపోయింది.

































