ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు, సృజనాత్మక చిత్రాలకు చిరునామా మణిరత్నం. ప్రముఖ కథానాయక సుహాసిని మణిరత్నం పెళ్లి చేసుకున్నారు. ఆయన తెలుగులో ఒకే ఒక చిత్రాన్ని రూపొందించారు. 1989 భాగ్య లక్ష్మీ ఎంటర్ప్రైజెస్, మణిరత్నం దర్శకత్వంలో గీతాంజలి చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో నాగార్జున, గిరిజ హీరోహీరోయిన్లుగా నటించారు. విజయ్ కుమార్, విజయ్ చందర్, షావుకారు జానకి, ముచ్చాల అరుణ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.

లైలా మజ్ను, మరోచరిత్ర, అభినందన సినిమాల సరసన చేరిన మరో ప్రేమకథాచిత్రం గీతాంజలి రవివర్మ ఓ ప్రకృతి దృశ్యాన్ని చిత్రీకరించిన అంతందంగా మణిరత్నం గీతాంజలి సినిమా తీర్చిదిద్దారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. భావుకతను నింపుకున్న కవి మనిషి హృదయాంతరాలను తాకే సుమధుర సుందర గీతమాల ఆనాటి గీతాంజలి చిత్రం. కళా దర్శకుడు మణిరత్నం అనేక మాసాలుగా తన మస్తిష్కంలో దాచుకున్న ప్రేమ కావ్యము గీతాంజలి కథ. మణిరత్నం, ఇళయరాజా, వేటూరి, శ్రీరామ్ లాంటి పంచ కళారత్నాలు ఈ చిత్రానికి పనిచేశారు.

ఇళయరాజా సంగీతం, వేటూరి కళం నుండి ఉప్పొంగిన గీతాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. ప్రకృతితో మమేకమైన ఆమని పాడవే కోయిల… మోడు బారిన హృదయాలు చెలించే రీతిగా..’ఓ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా’.. అనే గీతాలు ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తాయి. వెలుగు నీడల మిశ్రమంతో సృజనాత్మకంగా పిసి శ్రీరామ్ గీతాంజలి చిత్రాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. సాధారణంగా ప్రేమకథా చిత్రాల్లో కథానాయకుడు మరణించడం అనేది గత చిత్రాల్లో గమనించిన విషయం.

కానీ ఈ చిత్రంలో అటు కథానాయకుడు ఇటు కథానాయిక కూడా నయంకాని జబ్బులున్నాయని తెలుసుకుని కథానాయక గిరిజ విషణ్న వదనం.. ప్రేక్షకులను నిజంగానే కంట తడి పెట్టిస్తుంది. అయితే 1989లో విడుదలైన శివ, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, ముద్దుల మావయ్య, అంకుశం, కొడుకు దిద్దిన కాపురం, ఇంద్రుడు చంద్రుడు తర్వాత గీతాంజలి చిత్రం సక్సెస్ లో ఏడవ స్థానంలో నిలవాల్సి వచ్చింది. కానీ ఈ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడు మణిరత్నం, ఉత్తమ కథా రచయిత మణిరత్నం, ఉత్తమ హాస్యనటుడు సుత్తివేలు, ఉత్తమ కళాత్మక దర్శకుడు తోటతరణి, ఉత్తమ నృత్యదర్శకుడు సుందరం మాస్టర్, ఉత్తమ ఛాయాగ్రహణం పీసీ శ్రీరామ్ నంది అవార్డులు అందుకున్నారు.































