శంకరాభరణం సినిమా కోసం ప్రేక్షకులు చెప్పులు బయట విడిచి థియేటర్ లోకి వెళ్ళారని మీకు తెలుసా?

0
385

సంభాషణల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టుగా అద్భుతం జరిగేప్పుడు ఎవరు గుర్తించరు జరిగాక ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఆ మాటలు సరిగ్గా శంకరాభరణం చిత్రానికి సరిపోతాయి. తెలుగు చలన చిత్ర బావుటాను జాతీయస్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో శంకరాభరణం చిత్రం ఎగురవేసిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

పూర్ణోదయ పిక్చర్స్ వారి మొదటి చిత్రం సిరిసిరిమువ్వ కాగా ఏడిద నాగేశ్వరరావు రెండవ చిత్రంగా తాయారమ్మ బంగారయ్య తీసి శంకరాభరణం నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రానికి పెద్ద హీరోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ క్రమంలో ఏడిద నాగేశ్వరరావు స్నేహితుడు అప్పటి డిప్యూటీ కలెక్టర్ సోమయాజులును ప్రధాన పాత్రకు ఎంచుకున్నారు. ఇందులో మరో వేశ్య పాత్రకు అప్పటి వ్యాంపు క్యారెక్టర్లు చేసే మంజు భార్గవిని తీసుకున్నారు. మంజుభార్గవిని తీసుకోవడం వెనక సినీ ప్రముఖులు తీవ్ర విమర్శలు చేశారు.

ఈ చిత్రానికి మాటల రచయితగా అంతకుముందే ‘సిరిసిరిమువ్వ’ సినిమాకు చేసిన జంధ్యాల గారిని తీసుకున్నారు. జంధ్యాల తన కెరీర్ లోనే అతి తక్కువ సంభాషణలు రాసిన చిత్రం ‘శంకరాభరణం’ ఒక్కటే అని చెప్పవచ్చు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు సంభాషణలు తక్కువే అయినా ఎక్కువ అర్థాన్నిచ్చేవిగా ఉండటం విశేషం. ఆకలేసిన బాబు అమ్మ అని ఒకలా అంటాడు.. దెబ్బ తగిలిన బాబు అమ్మ అని మరోలా అంటాడు.. అదే నిద్రలో ఉలిక్కిపడ్డ బాబు ఇంకోలా అమ్మని పిలుస్తాడు.. ప్రతి అక్షరం వెనుక ఒక ఆర్ద్రత ఉంది. ఈ సంభాషణలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి.

సంగీతము లేకుండా ‘శంకరాభరణం’ సినిమాని ఊహించలేము. సినిమా మొదటి నుంచి చివరి వరకు పాటలు కావచ్చు లేదా నేపధ్య సంగీతం కావచ్చు కె.వి.మహదేవన్ చేసిన ప్రయత్నం మామూలుది కాదని చెప్పవచ్చు. శంకరా నాదశరీరాపరా.. వేదవిహారా హరా.. జీవేశ్వరా.!! ఈ పాట వింటున్నంత సేపు థియేటర్ లో ఉన్న ప్రేక్షకులకి పూనకాలే వచ్చాయంటే అతిశయోక్తి కాదు. కథ వినగానే పులకరించిన వేటూరి సుందర రామ్మూర్తి వెంటనే ఈ పాట రాయడం తర్వాత కె.వి.మహదేవన్ గారు బాణి కట్టడం జరిగింది. ఎస్పి.బాలసుబ్రమణ్యం తన సినీ జీవిత ప్రయాణంలో శంకరాభరణం ఒక మైలురాయిగా పేర్కొనవచ్చు.

విశ్వనాథ్ ఊహాత్మక కథకు బాలు మహేంద్ర తన కెమెరా కుంచెతో వెండితెరపై రంగులద్ధాడు. 1980 ఫిబ్రవరి 2న శంకరాభరణం విడుదలైంది. స్టార్ హీరోలు ఎవరూ లేకపోవడంతో సినిమాను చాలా తక్కువగా అంచనా వేసి మొదట్లో ఎవరు వెళ్లలేదు. కానీ కె.విశ్వనాథ్ పరమేశ్వరుని ఆరాధిస్తూ తీసిన పద్ధతి బాగుండడంతో కొంతమంది ప్రేక్షకులు చెప్పులు బయట విడిచి సినిమా థియేటర్లోకి వెళ్లడం మొదలుపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here